-ఆథరైజ్డ్ వెబ్‌సైట్ల ద్వారానే అసలు సమాచారం
విధాత: ఇటీవలే కొన్ని వెబ్‌సైట్లలో మీ క్రెడిట్ స్కోర్ (CREDIT SCORE)ను చూసుకున్నారా?.. అప్పట్నుంచి మీకు పెస్కీ కాల్స్ (PESKY CALLS) ఎక్కువైపోయాయనిపిస్తున్నదా?.. పర్సనల్ లోన్లు (PERSONAL LOAN), క్రెడిట్ కార్డు (CREDIT CARD)ల ఆఫర్లు పెరిగాయా?.. ఈ ప్రశ్నలన్నింటికి మీ సమాధానం అవును అయితే మీరు మీ క్రెడిట్ స్కోర్ కోసం తప్పుడు వెబ్‌సైట్లను ఆశ్రయించినట్లే.
అన్ ఆథరైజ్డ్ వెబ్‌సైట్ల ద్వారా క్రెడిట్ స్కోర్ చూసుకోవడం వల్లే ఇదంతా. అందుకే ఆథరైజ్డ్ వెబ్‌సైట్లనే క్రెడిట్ స్కోర్ కోసం ఆశ్రయించాలి. దేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరో (CREDIT BUREAU)లున్నాయి. అవి.. ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఈక్వీఫాక్స్, క్రిఫ్ హైమార్క్, ఎక్స్‌పరియన్. వీటిల్లో మీ క్రెడిట్ స్కోర్‌కు సంబంధించిన కచ్ఛితమైన సమాచారం ఉంటుంది.
ఇతర వెబ్‌సైట్లపై క్రెడిట్ స్కోర్ కోసం ఆరాతీస్తే కచ్ఛితమైన సమాచారం లభించకపోవచ్చు. పైగా మనకు రుణాలిచ్చే బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. సిబిల్ (CIBIL) వంటి వాటినే విశ్వసిస్తాయి. కాబట్టి ఇటువంటి ఆథరైజ్డ్ వెబ్‌సైట్లనే సందర్శించాలి. క్రెడిట్ యూనియన్ వెబ్‌సైట్స్, వన్‌స్కోర్ (ONE SCORE) వంటి యాప్స్‌లో సిబిల్ స్కోర్‌ను ఉచితంగానే పొందవచ్చు.
ఇక క్రెడిట్ స్కోర్ కోసం ఇతర వెబ్‌సైట్లకు మనమిచ్చే సమాచారం దుర్వినియోగమయ్యే వీలు కూడా ఉంటుంది. దీనివల్లే మీకు వస్తున్న అవాంఛిత పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు ఆఫర్లు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ లింక్స్‌పై క్లిక్ చేయవద్దు. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం అపహరణకు గురికావచ్చు. కొన్నిసార్లు ఆర్థికంగా కూడా నష్టపోవడానికి ఆస్కారం ఉన్నది.
ఇక తరచూ మీరు మీ క్రెడిట్ స్కోర్‌ను చూసుకోవడం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదు. అయితే మీ కోసం బ్యాంకులు తదితర సంస్థలు మీ క్రెడిట్ స్కోర్‌ను ఆరాతీస్తుంటే మాత్రం నష్టమే. దీనివల్ల మీకు రుణ అవసరాలు ఎక్కువని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు భావించే వీలున్నది. ఇది క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడానికి దారితీయవచ్చు. కనుక అనవసరంగా ఎక్కడా లోన్ల కోసం ప్రయత్నించవద్దు. లోన్ డిఫాల్ట్స్ వంటివి క్రెడిట్ స్కోర్‌ను అమాంతం తగ్గించేస్తాయని మరువద్దు.