Komatireddy | త్రిశంకు స్వర్గంలో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పార్టీ మార్పుపై ఆగని ప్రచారం అదే జరిగితే మునుగోడులో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం నిరాశా నిస్పృహల్లో మునుగోడు బీజేపీ శ్రేణులు కాంగ్రెస్‌లో చేరినా కేడర్ సహకారంపై అనుమానాలు Komatireddy | విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీ పార్టీలో ఇమడలేక పోతున్నారని, అందుకే ఆయన తన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్ లోకి రావడానికి లోపాయికారి ప్రయత్నాలు చేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2018 […]

  • Publish Date - August 17, 2023 / 11:00 AM IST

  • పార్టీ మార్పుపై ఆగని ప్రచారం
  • అదే జరిగితే మునుగోడులో బీజేపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం
  • నిరాశా నిస్పృహల్లో మునుగోడు బీజేపీ శ్రేణులు
  • కాంగ్రెస్‌లో చేరినా కేడర్ సహకారంపై అనుమానాలు

Komatireddy |

విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీ పార్టీలో ఇమడలేక పోతున్నారని, అందుకే ఆయన తన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్ లోకి రావడానికి లోపాయికారి ప్రయత్నాలు చేస్తున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆరెస్‌ అభ్యర్థి, మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy) పై విజయం సాధించారు.

అనంతరం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తో నెలకొన్న విబేధాలు…సీఎం కేసీఆర్ వలస రాజకీయాలతో కాంగ్రెస్ బలహీన పడిందని, కేసీఆర్‌ను గద్దె దించే శక్తి బీజేపీకే ఉందని, దేశంలోనూ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేదంటూ రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై కొట్టి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆపార్టీ రాజకీయ వ్యూహంలో భాగంగా చేరి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చారు.

అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వచ్చిన 2022 మునుగోడు (Munugode) ఉప ఎన్నికలో ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి ఆయన నియోజకవర్గ రాజకీయాలతో పాటు బీజేపీ పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. అంతే కాదు కనీసం పార్టీ శ్రేణులకు సైతం అందుబాటులో లేరు.

దీంతో మునుగోడు నియోజకవర్గ బీజేపీ లో స్తబ్ధత నెలకొంది. పార్టీ శ్రేణులు నిరాశా నిస్పృహలకు గురయ్యారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి తన పార్టీ శ్రేణులకు దూరంగా ఉండటం కొత్త కాదని, గతంలో మునుగోడు ఎమ్మెల్యే గా ఉన్న టైం లో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు కానీ, పార్టీ కార్యకర్తలకు గానీ అందుబాటులో లేడనే అపవాదును మూటగట్టుకున్నాడన్న సంగతిని కేడర్ గుర్తు చేసుకుంటుంది.

టికెట్లపై హమీ వస్తే పార్టీ మార్పు

ఇదిలా ఉంటే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పార్టీ మారే క్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డికి భువనగిరి ఎంపీ టికెట్ లేదా ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్, ఆయన భార్య కోమటిరెడ్డి లక్ష్మికి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు గా పార్టీ శ్రేణులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

అయితే ఆయన ఎంపీ టికెట్ కు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, కానీ ఆయన భార్య లక్ష్మికి మాత్రం మునుగోడు టికెట్ విషయంలో పార్టీ అధిష్ఠానం నుంచి కావాల్సిన హామీ లభించనందుకే పార్టీ లో చేరిక విషయంపై స్తబ్ధత కొనసాగుతోందని వినబడుతోంది. ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను బీజేపీ లోనే కొనసాగుతానని, మునుగోడు ఎమ్మెల్యే గా తిరిగి బరిలో ఉంటానని మీడియా ముందు స్టేట్మెంట్ లు ఇవ్వటం రాజకీయ వర్గాలలో, ప్రజల్లో చర్చనీయాంశమైంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజగోపాల్ రెడ్డి ఒక వేళ మునుగోడు నుండే పోటీ చేయదలుచుకుంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కూడా నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కార్యక్రమాలకుగాని, పార్టీ శ్రేణులకు గాని అందుబాటులోకి రాకపోవడం పలు సందేహాలను రేకెత్తిస్తోంది. అంతే కాదు ఒక వేళ ఆయన పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినా కూడా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు సహకరిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.

ఎందుకంటే ఇప్పటికే మునుగోడు నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి దివంగత కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పాల్వాయి స్రవంతి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుడిగా పేరున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చలమల కృష్ణారెడ్డి, బీసీ కోటాలో పున్న కైలాశ్‌ లు పోటీ పడుతున్నారు.

అంతే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా,ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీని విమర్శించి, ఆ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి ఒక వేళ తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినా ఆయనకు పార్టీ శ్రేణులు మాత్రం సహకరించే పరిస్థితిలో లేరని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Latest News