Komatireddy Venkat Reddy
- గాలిలో వచ్చిన నాయకులు గాలిలోనే పోతారు
విధాత, నేను యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడే బెంజ్ కారులో తిరిగా… అనేక వ్యాపారాలు చేసి ఈస్థాయికి ఎదిగాను.. నిధుల మంజూరుపై ప్రశ్నిస్తే కోమటిరెడ్డికి బెంజ్ కారు ఉందని అంటావా..నీలా సాండ్..ల్యాండ్..మైన్, వైన్‌ల అక్రమ దందాలతో సంపాదించలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై ఫైర్ అయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మండలం పాటిమట్ల ఎక్స్ రోడ్ దగ్గర ఎన్ హెచ్ 930 పీ రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతు తాను సంపాదించిన డబ్బును పేదలకే ఖర్చు చేస్తున్నానని, తుంగతుర్తి, నాగారంలో ఎంతోమంది పేదలు చనిపోతే ఒక్కరికైనా సాయం చేశావా? అంటు కిషోర్‌పై మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్ ఆమెరికాలో చదివి వచ్చాడని, కాస్త తెలివి ఉందని అనుకున్నా.. ఏం లేదన్నారు. వెంకట్‌రెడ్డి నిధులు తేలేదని, స్థానిక ఎమ్మెల్యే కిషోర్ 6వేల 800 కోట్లు తెప్పించుకున్నారని కేటీఆర్ చెప్పారని, ఆయనకు పోయినసారి 2వేల మెజార్టీనే వచ్చిందని, ఈసారి 40వేల మెజార్టీ కావాలని కేటీఆర్ మాట్లాడటం అర్ధరహితంగా ఉందన్నారు. జాతీయ రహదారులు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం.. లోకల్ ఎంపీ అభ్యర్థన మేరకు మంజూరు చేస్తారన్నారు.
గాదరి కిశోర్ కు ఢిల్లీ ఎక్కడుందో తెలుసా అని, ఆయన తిరిగేది గల్లీలో.. చేసేది ఇసుక మాఫియా అని అలాంటి వ్యక్తికి ఢిల్లీ గురించి ఏం తెలుస్తుందన్నారు. నిధులన్నీ ఆయన తెప్పించిండా? వేల కోట్లు సంపాదించి స్థలాలు, ఇళ్లు కొనుక్కున్న జగదీష్ రెడ్డి తెప్పించాడా? వీళ్లిద్దరూ అవినీతిలో పోటీ పడుతున్నారన్నారు. నిధుల మంజూరు విషయంలో కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకోవాలి. నిధుల విషయంలో ఫ్లైట్ టికెట్లు నేనే బుక్ చేస్తా.. ఎవరొస్తారో రండి.. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులోనే తేల్చుకుందామన్నారు.
ఇసుక మాఫియా, తెలంగాణ లూటీ ఆపాలన్నా కాంగ్రెస్ పాలన రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి సంతకం 4వేల పింఛన్ పైనే చేస్తామన్నారు. ప్రియాంక గాంధీ 20న కొల్లాపూర్ వస్తున్నరన్నారు. మహిళా, బీసీ డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నామని, అమలయ్యే హామీలే ప్రకటిస్తామన్నారు.
బీఆర్ఎస్ పాలనలో దుబారా ఖర్చును అధికంగా జరుగుతోందని, ఎమ్మెల్యే, మంత్రి బయటకొస్తే 4, 10 కార్లతో వెళ్తున్నారన్నారు. 4 పార్టీలు మారిన గుత్తా సుఖేందర్ రెడ్డి వెంట 12 కార్లు ఉంటాయని, గాదరి కిశోర్, జగదీష్ రెడ్డి.. ఇలా అందరూ దుబారా ఖర్చు చేస్తున్నారన్నారు. వీళ్లంతా పనికిరాని నాయకులని, గాలిలో వచ్చారు.. గాలిలోనే పోతారన్నారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు గౌరెల్లి దగ్గర కనెక్ట్ అయ్యే భద్రాద్రి కొత్తగూడెం వరకు వచ్చే రహదారిని ఈమధ్యే కేంద్రం ఎన్ హెచ్ 930 పీ గా ప్రకటించిందని, రహదారి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. 2200 కోట్లతో కేంద్రంతో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ను మంజూరు చేయించానన్నారు. ఇందులో భాగంగా మొదటి ఫేజ్ లో వలిగొండ నుంచి తిరుమల గిరికి పనులు జరుగుతున్నాయన్నారు. పనులను పరిశీలించి ప్రాజెక్ట్ ప్రతినిధులతో మాట్లాడానన్నారు.
పార్లమెంట్ లో ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో సార్లు ప్రసంగించానని, అలాగే, ప్రధాని మోడీని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధులు మంజూరీ చేయించానన్నారు. రోడ్లు వస్తే పరిశ్రమలు వస్తాయని, అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డానట్లు చెప్పారు.
తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిగా గ్రామాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటానని, కరోనా లేకపోతే ఈ రహదారి పనులు ప్రారంభమై పూర్తయ్యేవని, హైదరాబాద్, విజయవాడ రహదారిని ఆరు లేన్లు చేయిస్తున్నామని నితిన్ గడ్కరీ స్వయంగా చెప్పారని, తన అభ్యర్థనతోనే రహదారులకు నిధులు కేటాయిస్తున్నామని. ఇంత కష్టపడి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తుంటే కేటీఆర్ ఎంపీ వెంకట్‌రెడ్డి నిధులు తేలేదంటు మాట్లాడటం దారుణమన్నారు.