విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (పిసిసి) నూతన కమిటీ నియామకం వరంగల్ జిల్లాలో అసంతృప్తికి దారితీసింది. పీసీసీలో స్థానంపై ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి కొండా సురేఖ అసంతృప్తికి గురై ఏకంగా పీసీసీ చీఫ్‌కు రాజీనామా లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉమ్మడి జిల్లాలో తమ బలం, బలగం, రాజకీయ చరిత్ర వివరించారు.
పీసీసీ తాజా నూతన కమిటీలో తమకు సముచిత స్థానం దక్కలేదని భావిస్తున్నట్లు ప్రకటించారు. తనకంటే జూనియర్లకు రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఎసీ)లో స్థానం కల్పించారని, ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి పీఏసీలో స్థానం కల్పించి తనను కేవలం పీసీసీ కార్యవర్గ సభ్యురాలిగా పరిమితం చేయడం పట్ల అసంతృప్తికి లోనైనట్లు భావిస్తున్నారు.
ఈ కమిటీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయని వారున్నారంటూ పేర్కొన్నారు. ఇది తనను అవమానించి నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తమకు పదవులు ముఖ్యం కాదని సామాన్య కార్యకర్తలుగా కొనసాగుతామని లేఖలో పేర్కొన్నారు.
ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ శనివారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటుపీసీసీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో కొండా సురేఖను పీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు. ఈ నియామకంపై అసంతృప్తితో ఉన్న కొండా సురేఖ ఆదివారం ఆ బాధ్యతలకు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
అయితే ఈ రాజీనామా ప్రకటనతో సురేఖ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. జరిగిన ఈ గందరగోళానికి తెరదించుతూ సురేఖ ఈ విషయమై స్పష్టతనిచ్చినట్లు తెలిసింది. శనివారం నియమించిన పిసిసి కార్యవర్గ సభ్యురాలి పదవికి మాత్రమే తాను రాజీనామా చేస్తున్నట్లు సన్నిహితులతో స్పష్టం చేశారు.
తాను, తన భర్త కొండా మురళి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టంగా తెలియజేశారు. దీంతో పార్టీకి రాజీనామా పై నెలకొన్న గందరగోళానికి పుల్ స్టాప్ పెట్టినట్లయింది. తాము పార్టీ వీడుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సురేఖ తమ అనుచరులను కోరినట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి లేఖ రాసి హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది.