Krishna Board | నాగార్జున సాగర్ నీటిపై కృష్ణా బోర్డు కీలక నిర్ణయం

  • Publish Date - April 12, 2024 / 06:05 PM IST

ఏపీకి 5.5టీఎంసీ..తెలంగాణకు 8.5టీఎంసీలు

విధాత, హైదరాబాద్‌ : నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుత నీటి మట్టాలను పరిగణలోకి తీసుకుని కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కీలక నిర్ణయం తీసుకుంది. సాగర్‌లో 500 అడుగులపైన ఉన్న 14టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డిలు హాజరయ్యారు.

ఈ భేటీలో శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో ఉన్న ప్రస్తుత నీటి నిల్వలను జూన్ వరకు తాగునీటి అవసరాల కోసం వాడుకునే విషయమై చర్చించారు. గత అక్టోబర్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించగా.. అందులో తమకు మరో 5 టీఎంసీల మిగులు ఉందని, తెలంగాణ అదనంగా 7 టీఎంసీలు వినియోగించుకొందని ఏపీ ఈఎన్సీ వివరించారు. సాగర్ నుంచి వెంటనే తమకు 5 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.సాగర్ దిగువన తమకు తాగునీటికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ట్యాంకర్లతో నీరు సరఫరా చేయాల్సి వస్తోందని ఏపీ ఈఎన్సీ తెలిపారు. సాగర్ కుడికాల్వ నుంచి వీలైనంత ఎక్కువ నీరు ఇవ్వాలని కోరారు.

అయితే కృష్ణా జలాల్లో ఏపీ ఎక్కువ మొత్తాన్నే వినియోగించుకొందని, అంతా లెక్కలోకి రాలేదని తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు. శ్రీశైలం నుంచి ఏపీకి ఎలాంటి అవసరాలకైనా నీరు తీసుకోకుండా చూడాలని కోరారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఎక్కువ మంది తాగునీటి కోసం సాగర్ పై ఆధారపడ్డారని తెలంగాణ ఈఎన్సీ వివరించారు. హైదరాబాద్ జనాభాను పరిగణనలోకి తీసుకొని తాగునీటి కోసం ఎక్కువ మొత్తం కేటాయించాలని కోరారు. దీంతో నాగార్జునసాగర్‌లో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. మే నెలలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

Latest News