కృష్ణా బోర్డుకే సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కృష్ణా నది యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ)కే అప్పగించాలని కేంద్రం భావిస్తున్నది. నవంబర్ 28న అర్ధరాత్రి సాగర్ డ్యాం

  • Publish Date - January 17, 2024 / 01:01 PM IST

  • కొనసాగనున్న సీఆర్పీఎఫ్ పర్యవేక్షణ

విధాత : నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు కృష్ణా నది యాజమాన్యబోర్డు(కేఆర్‌ఎంబీ)కే అప్పగించాలని కేంద్రం భావిస్తున్నది. నవంబర్ 28న అర్ధరాత్రి సాగర్ డ్యాంపై రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య తలెత్తిన వివాదం నేపధ్యంలో ప్రాజెక్టు నిర్వాహణ అంశంపై బుధవారం ఢిల్లీలో రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దెబశ్రీ ముఖర్జీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగర్ డ్యాం భద్రతా, నిర్వాహణను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేంద్రం భావిస్తుందని రెండు రాష్ట్రాల అధికారులకు వివరించారు. దీంతో తమ ప్రభుత్వాలతో చర్చించి దీనిపై తమ నిర్ణయం చెబుతామని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు. ముందుగా సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈలు చర్చించి నిర్ణయానికి రావాలని జలశక్తిశాఖ సూచించింది. దీనిపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేసింది. అయితే సాగర్ వద్ద సీఆర్పీఎప్ పర్యవేక్షణ కొనసాగించాలని ఏపీ, తెలంగాణ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.



 


కాగా ప్రాజెక్టు పరిధిలోని విద్యుత్తు ప్రాజెక్టులు, నీటి విడుదల సమస్య సహా ఇతర సాంకేతిక అంశాలు ఎవరి పరిధిలో ఉండాలనేది తేలాల్సివుందని, దీనిపై తదుపరి భేటీలో తమ అభిప్రాయలు వెల్లడిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని కొనసాగించి ప్రాజెక్టు నిర్వాహణ బాధ్యతను తమ పరిధిలోనే కొనసాగించాలని కోరుతుండగా, సాగర్ డ్యాం 13వ గేటు నుంచి ఏపీ భూభాగం పరిధిలోని గేట్లు, కుడి కాల్వ, విద్యుత్తు ఫ్లాంట్లను తమకు అప్పగించాలని ఏపీ కోరుతుంది. ఈ నేపధ్యంలో నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకున్న కేంద్రం ప్రాజెక్టు నిర్వాహణ, భద్రత బాధ్యతను కేఆర్‌ఎంబీకి అప్పగించేందుకు సిద్ధమైంది. దీనిపై తదుపరి భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశముంది.

Latest News