సాగర్ జలాలపై ఏపీ ప్రభుత్వం దుస్సాహసం

నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఆంధ్ర పోలీసులు దండయాత్ర చేసి 13 గేట్లను ఆక్రమించడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

  • Publish Date - December 2, 2023 / 08:56 AM IST

  • 13 గేట్లను ఆక్రమించడం దుర్మార్గం
  • కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు పాటించాలి
  • తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఆంధ్ర పోలీసులు దండయాత్ర చేసి 13 గేట్లను ఆక్రమించడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆంధ్ర ప్రభుత్వ దుస్సాహసాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.


రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం శ్రీశైలం.. ఆంధ్ర పర్యవేక్షణలో, సాగర్.. తెలంగాణ పర్యవేక్షణలో ఉందన్నారు. కానీ దురాక్రమణ చేస్తూ ఆంధ్ర ప్రభుత్వం ఇలా ద్వంద్వ వైఖరి అవలంభించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది విరుద్ధమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల సామరస్య వాతావరణానికి విఘాతం కలిగేలా ఉందని, వెంటనే దురాలోచన ఉపసంహరించుకోవాలని సూచించారు.


ఇప్పటికే కృష్ణా రివర్ బోర్డ్ ఆదేశించినప్పటికీ ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వెంటనే ఆంధ్ర పోలీసులు వెనక్కి పోవాలన్నారు. ఆంధ్రకు నీటి విడుదల కూడా కొనసాగుతుందని.. రాష్ట్రాల పరిధిలో వుండే హక్కులను కేంద్రం చేతుల్లోకి పోయేవిధంగా ఆంధ్ర ప్రభుత్వం కుట్ర చేసిందని మండిపడ్డారు.


మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎక్జిట్ పోల్స్ అన్ని ఫాల్స్ అని కొట్టిపడేశారు. ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ ప్రభంజనం వీస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రంలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ఎగ్జిట్ పోల్స్ ఏవీ నిజం కావన్నారు. కొన్నిసార్లు భూమరాంగ్ అవుతాయన్నారు.

Latest News