విధాత: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఇటీవల బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఉద్యమాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మీ ఉద్యమం తనకెంతో నచ్చిందని ఆయన పేర్కొన్నారు. నిన్న బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మీ సమస్యలపై ఆందోళన చేస్తున్నప్పుడు ప్రతీ రోజు పేపర్లు, టీవీల్లో చూశానని కేటీఆర్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ సహకారంతో మీ సమస్యలను మీరు పరిష్కరించుకున్నారు. మీరు ఎంచుకున్న పద్దతి నాకు నచ్చింది.
గాంధీ సత్యాగ్రహ పద్దతిలో శాంతియుతంగా, వానలో కూడా బయట కూర్చోని కొట్లాడిన పద్దతి నాకు చాలా నచ్చింది. చాలా గొప్పగా వారం రోజులు మంచి స్పూర్తితో పోరాడారు అని కొనియాడారు. కేవలం సమస్యల కోసం ఆందోళన చేసిన మీరు అందులో రాజకీయ పార్టీలకు తావు ఇవ్వకపోవడం నచ్చిందని మంత్రి పేర్కొన్నారు. సర్కార్ దృష్టిని ఆకర్షించడానికే ఆందోళన చేస్తున్నామని చెప్పారు. అందుకు అభినందనలు చెబుతున్నాను అని కేటీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.