మానసిక ఒత్తిళ్ల‌తో మ‌హిళా జ‌డ్జి ఆత్మ‌హ‌త్య‌..!

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌దౌన్ జిల్లాలోని జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన జ‌డ్జిని జ్యోత్స్న రాయ్‌(27)గా పోలీసులు గుర్తించారు

  • Publish Date - February 4, 2024 / 10:26 AM IST

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌దౌన్ జిల్లాలోని జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన మ‌హిళా జ‌డ్జిని జ్యోత్స్న రాయ్‌(27)గా పోలీసులు గుర్తించారు. త‌న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.

అయితే శ‌నివారం ఉదయం 10 గంట‌ల వ‌ర‌కు జ్యోత్స్న రాయ్ కోర్టుకు చేరుకోవాలి. కానీ ఆమె కోర్టుకు రాక‌పోవ‌డంతో.. కొలిగ్స్ ఆమెకు ఫోన్ చేశారు. కానీ జ‌డ్జి ఫోన్ కాల్స్‌కు స్పందించ‌లేదు. జ‌డ్జి కాల‌నీలోని ఆమె ఇంటికి వెళ్లి చూడ‌గా, గ‌ది మూసి ఉంది. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా, ఫ్యాన్‌కు వేలాడుతూ జ్యోత్స్న క‌నిపించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఘ‌ట‌నాస్థ‌లిలో సూసైడ్ నోట్‌తో పాటు ఇత‌ర డాక్యుమెంట్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిళ్ల కార‌ణంతోనే చ‌నిపోతున్న‌ట్లు జ్యోత్స్న రాయ్ త‌న సూసైడ్ నోట్‌లో పేర్కొన్న‌ట్లు పోలీసులు తెలిపారు. జ్యోత్స్న మౌ జిల్లాకు చెందిన వ్య‌క్తి. అయోధ్యలోని జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్‌లో ప‌ని చేశారు. గ‌తేడాది ఏప్రిల్‌లో బదౌన్ జిల్లాలో సివిల్ జ‌డ్జిగా నియామ‌కం అయ్యారు.