Site icon vidhaatha

సినిమాల్లో అశ్లీల డ్యాన్స్ లపై చట్టపర చర్యలు: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్

Telangana State Women’s Commission: సినిమాల్లో పాటలలో అసభ్యకరమైన డ్యాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలని. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నెరెళ్ల శారద ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించిందని.. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో, ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోందని తెలిపారు. మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత అని.. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

Exit mobile version