విధాత: చిరుత పులి పేరు వినగానే వణికిపోతాం. మరి అలాంటి చిరుత.. ఏకంగా ఇంట్లోకి ప్రవేశిస్తే ఏమవుతుంది. ఆ ఇంట్లో ఉన్న వారందరి గుండెలు ఆగిపోవాల్సిందే. మహారాష్ట్ర సతారాలోని ఓ ఇంట్లోకి చిరుత ప్రవేశించి, కుటుంబ సభ్యులందరినీ తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
ఆ ఇంట్లో ఉన్న వారంతా దుర్గా మాత నిమజ్జన కార్యక్రమానికి వెళ్లగా, మెల్లగా ఇంట్లోకి చిరుత వచ్చి చేరింది. నిమజ్జన కార్యక్రమం ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా పులి కనిపించింది. తలుపు దగ్గర కూర్చొన్న చిరుతను చూసి వారు హడలిపోయారు. కుటుంబ సభ్యులందరూ గేటు వద్దకు వచ్చి మూసేశారు.
ఇక గ్రామస్తులకు తెలియడంతో.. జనాలంతా అక్కడ క్షణాల్లో వాలిపోయారు. వారందరినీ చూసి చిరుత గట్టిగా అరవడం ప్రారంభించింది. అక్కడున్న వారిపై దాడి చేసేందుకు యత్నించింది. చివరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని, చిరుతను బంధించి తీసుకెళ్లారు.