అద్భుత‌మైన భార‌తావ‌నిని నిర్మిద్దాం.. క్రిస్టియ‌న్ స‌భ‌లో కేసీఆర్ పిలుపు

విధాత‌: జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి, ఒక అభ్యుద‌య ప‌థంలో నిల‌బెట్ట‌గ‌లిగినామో, ఈ రోజు జై భార‌త్ నినాదంతో మ‌నంద‌రం పురోగ‌మించి అద్భుత‌మైన భార‌తావ‌ని నిర్మాణం కోసం ఈ క్రిస్మ‌స్ సంద‌ర్భంలో అంకితం అవుదామ‌ని, అందుకోసం మీ ఆశీస్సులు, అండ‌దండ‌లు కావాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. 20 ఏండ్ల క్రితం భ‌యంక‌ర‌మైన వివ‌క్ష‌.. త‌ప్ప‌కుండా […]

  • Publish Date - December 21, 2022 / 04:11 PM IST

విధాత‌: జై తెలంగాణ నినాదంతో తెలంగాణ సాధించి, ఒక అభ్యుద‌య ప‌థంలో నిల‌బెట్ట‌గ‌లిగినామో, ఈ రోజు జై భార‌త్ నినాదంతో మ‌నంద‌రం పురోగ‌మించి అద్భుత‌మైన భార‌తావ‌ని నిర్మాణం కోసం ఈ క్రిస్మ‌స్ సంద‌ర్భంలో అంకితం అవుదామ‌ని, అందుకోసం మీ ఆశీస్సులు, అండ‌దండ‌లు కావాల‌ని కోరుతున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

20 ఏండ్ల క్రితం భ‌యంక‌ర‌మైన వివ‌క్ష‌..

త‌ప్ప‌కుండా యావ‌త్ స‌మాజం ముందుకు పురోగ‌మించే అవ‌స‌రం ఉంది అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది సంద‌ర్భం కాబ‌ట్టి ప్ర‌త్యేకించి ఒక మాట మీకు మ‌న‌వి చేస్తున్నాను. ఒక 20 ఏండ్ల క్రితం అశాంతితో, వ‌ల‌స‌ల‌తో, ఆత్మ‌హ‌త్య‌ల‌తో, దిక్కు తోచ‌ని స్థితిలో భ‌యంక‌ర‌మైన వివ‌క్ష‌కు గుర‌వుతూ చిన్న‌బుచ్చుకున్న‌టువంటి తెలంగాణ స‌మాజాన్ని చూసి ఈ స‌మాజానికి మేలు జ‌ర‌గాల‌ని జై తెలంగాణ అనే ఒక నినాదంతో మ‌నం ఒక యుద్ధాన్ని ప్రారంభించాం.

ఆ రోజు అనేక మంది పైన‌, కింద ఉన్న మిత్రులు నాతో పాటు న‌డుస్తూ న‌డుస్తూ చివ‌ర‌కు మ‌నం విజ‌యం సాధించాం. ఆ విజ‌య ప‌రంప‌ర‌లో భాగంగా ఏం జ‌రుగుతుందో మ‌న వారు చెప్పారు. కులం, మ‌తం, వ‌ర్గం, జాతి అనే వివ‌క్ష లేకుండా అంద‌రితో అన్ని విష‌యాలు పంచుకుంటూ అన్ని పండుగ‌ల‌ను చాలా గొప్ప‌గా, ఉన్నంతలో ఘ‌నంగా జ‌రుపుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గ‌ర్వంగా, సంతోషంగా మ‌న‌వి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

భార‌త‌దేశం అన్ని ర‌కాలుగా పురోగ‌మించాలి..

ఏడేండ్ల క్రితం మ‌న త‌ల‌స‌రి ఆదాయం ల‌క్ష ఉండేది. ఈ రోజు అనేక పెద్ద పెద్ద రాష్ట్రాల‌ను అధిగ‌మించి ఇవాళ మ‌న త‌ల‌స‌రి ఆదాయం 2 ల‌క్ష‌ల 75 వేలు. ప‌ర్ క్యాపిట ప‌వ‌ర్ యుటిలైజేష‌న్‌లో గానీ, ఇంకా ఇత‌ర అనేక విష‌యాల్లో గానీ నంబ‌ర్ వ‌న్, నంబ‌ర్ టు స్థానానికి తెలంగాణ రాష్ట్రం పురోగ‌మించింది.

మీ అంద‌రితో కూడా మ‌న‌వి చేసేది ఏందంటే ఇది రాజ‌కీయ వేదిక కాన‌ప్ప‌టికీ ఒక మంచి కోసం జ‌రిగే ప్ర‌య‌త్నంలో అంద‌రం భాగ‌స్వాములం కావాలి. తెలంగాణ సాధించిన‌టువంటి పురోగ‌తి యావ‌త్ దేశంలోని అన్ని మారుమూల రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో రావాలి అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

దాని కోస‌మే మ‌ళ్లీ మ‌నం కొత్త యుద్ధానికి, కొత్త స‌మ‌రానికి శంఖం పూరించాం. త‌ప్ప‌కుండా తెలంగాణ మాదిరిగానే భార‌త‌దేశం అన్ని ర‌కాలుగా పురోగ‌మించి, ప్ర‌పంచంలోనే ఒక గొప్ప దేశంగా, శాంతి కాముక దేశంగా, పురోగ‌మించే దిశ‌గా మ‌న‌కు విజ‌యం చేకూరాల‌ని చెప్పి ఈ సంద‌ర్భంగా భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అందులో మీ అంద‌రి స‌హ‌కారాన్ని కూడా నేను కోరుతున్నాను అని కేసీఆర్ తెలిపారు.

త్వ‌ర‌లోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో స‌మావేశం

కొన్ని స‌మ‌స్య‌ల గురించి ఆంటోనీ నాకు చెప్పారు అని కేసీఆర్ గుర్తు చేశారు. క్రైస్త‌వ మ‌త పెద్ద‌ల‌తో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నేను ఒక స‌మావేశం నిర్వ‌హించి, జ‌ర‌గ‌వ‌లిసిన ప‌నుల గురించి, అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌ల‌ను త‌ప్ప‌కుండా తీసుకుంటామ‌ని చెప్పి ఈ సంద‌ర్భంగా మీ అంద‌రికీ హామీ ఇస్తున్నాను.

ఆ దిశ‌గా మ‌నం పురోగ‌మిద్దామ‌ని ఆశిస్తూ దేశ వ్యాప్తంగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్త‌వ సోద‌రులంద‌రికీ హ్యాపీ క్రిస్మ‌స్, మేరీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను అని తెలిపిన కేసీఆర్ జై భార‌త్ నినాదంతో త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

క్రీస్తు బోధ‌న‌లు ఆద‌రిస్తే యుద్ధాలే జ‌ర‌గ‌వు: సీఎం కేసీఆర్

విధాత: తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్త‌వులంద‌రికీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హృద‌య‌పూర్వ‌క‌మైన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. క్రీస్తు బోధ‌న‌లు ఆద‌రిస్తే ప్ర‌పంచంలో యుద్ధాలే జ‌ర‌గవని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

మ‌నిషి త‌న‌కు తాను ఏ విధంగా ప్రేమించుకుంటాడో, పొరుగువారిని, ఇత‌రుల‌ను కూడా ప్రేమించ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని చెప్పి ఒక శాంతిదూత‌గా ప్ర‌పంచానికి సందేశం ఇచ్చిన‌ మ‌హోన్న‌త‌మైన‌ దేవుని బిడ్డ జిస‌స్ క్రీస్తు. క్రీస్తు బోధ‌న‌లు నిజంగా తూచా తప్ప‌కుండా ఆద‌రిస్తే ఈ ప్ర‌పంచంలో ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషం, స్వార్థ్యం, ఇత‌రుల ప‌ట్ల అస‌హ‌నం అనేవి ఉండ‌నే ఉండ‌వని అన్నారు.

ఒక మాట‌లో చెప్పాలంటే ప్ర‌ప‌చంలో యుద్ధాలే జ‌ర‌గ‌వని, నేర‌స్తులుగా ప‌రిగ‌ణించి జైళ్ల‌లో ఉండే వారి కోసం జైళ్లే అవ‌స‌రం ఉండ‌వు. నిజంగా వారు చెప్పిన ప్ర‌పంచం, వారు క‌ల‌ల‌గ‌న్న ప్ర‌పంచం, క్రీస్తు కాంక్షించిన ప్ర‌పంచం, ఎంత ఉదాత్త‌మ‌న‌, ఔన్న‌త్య‌మైన, ఎంతో గొప్ప మాన‌వ ప్ర‌పంచం అని అన్నారు. అది సాధించ‌గ‌లిగితే మ‌నిషి దేవుడవుతాడని పేర్కొన్నారు.

ఆ సందేశం తీసుకునే వారు దేవ‌దూత‌, దేవుని బిడ్డ‌గా మ‌న మ‌ధ్య‌కి వ‌చ్చి చాలా ప్ర‌య‌త్నం చేశారని, ఎన్నో హింస‌ల‌కు, అవ‌మానాల‌కు, న‌మ్మిన సొంత వ్య‌క్తుల చేతిలోనే హ‌త్య‌కు గుర‌య్యే ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ కూడా త‌న చివ‌రి క్ష‌ణంలో కూడా తుదిశ్వాస విడిచే వ‌ర‌కు విశాల‌మైన‌ ఈ భూమి అంతా వ‌సుదైక కుటుంబంగా, యూనివ‌ర్స్ ఒక ఫ్యామిలీగా ఉండాల‌ని ఆకాంక్షించిన మ‌హోన్న‌తుడు మ‌న క్రీస్తు అని అట్లాంటి అనేక మంది పెద్ద‌లు, శాంతిదూత‌లు, దైవ దూత‌లు మ‌న మ‌ధ్య‌కు వ‌చ్చి చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు.

క‌రుణ‌, ద‌య గురించి ఎంత ఎక్కువ ప్ర‌చారం చేస్తే అంత మంచిది..

మాన‌వుడు ప‌రిణితిని, ప‌రిప‌క్వ‌త‌ను సాధిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగ‌మిస్తున్న‌ప్ప‌టికీ ఇటువంటి విష‌యాల్లో ఇంకా పురోగ‌మ‌నం చెందాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నేను భావిస్తున్నానని, దాని కోసం క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో ఏ మ‌తానికి సంబంధించిన‌ మ‌త బోధ‌కులైనా, మ‌త కార్యాల‌యాలైనా ఆల‌యాలైనా చ‌ర్చిలైనా, మ‌సీదులైనా, మ‌రొక‌టైనా.. బౌద్ధ జైన మందిరాలైనా హ్యుమ‌న్ ఇంపార్టెన్స్ గురించి, హ్యుమ‌న్ క్వాలిటీస్, ఇంప్రూవ్‌మెంట్ గురించి, క‌రుణ‌, ద‌య వంటి గ్రేస్‌పుల్ జీవితం గురించి ఎంత ఎక్కువ ప్ర‌చారం చేస్తే అంత మంచిద‌ని ఈ సంద‌ర్భంగా పెద్ద‌లంద‌రికీ మ‌న‌వి చేస్తున్నా అన్నారు.

అటువంటి ప్ర‌పంచం రావాల‌ని క్రీస్తు త‌ర్వాత కూడా ఎందరో మ‌హ‌నీయులు, అనేక మంది స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం, ప్ర‌గ‌తి కోసం అంద‌రూ చ‌క్క‌గా బ‌తికేట‌టువంటి స‌మాజం కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ ప‌విత్ర‌మైన క్రీస్తు జ‌న్మించిన డిసెంబ‌ర్ మాసంలో మ‌నందరం కూడా అటువంటి భావాలు అల‌వాటు చేసుకోవ‌డానికి, ఆచ‌రించ‌డానికి ఆయ‌న మార్గంలో ప‌య‌నించ‌డానికి ప్ర‌య‌త్నిద్దిదామ‌ని, ఆ ప్ర‌య‌త్నంలో మ‌నం విజ‌యం సాధించాల‌ని నేను మ‌నస్ఫూర్తిగా క్రీస్తు భ‌గ‌వానుడిని ప్రార్థిస్తున్నాను. మ‌న అంద‌రికీ కూడా శుభం క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను అని కేసీఆర్ తెలిపారు.