-ఒక్క ప్రీమియం చెల్లిస్తే చాలు
విధాత: భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టాలన్నది ఎప్పుడూ మంచి నిర్ణయమే. భారతీయులు ఈ విషయంలో ముందే ఉంటారు. ఈ క్రమంలోనే రకరకాల పెట్టుబడులను చేస్తూ ఉంటారు. ఇక ఎల్ఐసీ పెట్టుబడి అనేది అటు భవిష్యత్తుకు.. ఇటు కుటుంబానికి భరోసా. అందుకే దేశంలో చాలామంది ఎల్ఐసీ పథకాల్లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎల్‌ఐసీ కూడా సరికొత్త పథకాలను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఇలాంటిదే ధన్ వర్ష 866 ప్లాన్.
ఈ ధన్ వర్ష 866 ప్లాన్‌లో సింగిల్ ప్రీమియంగా రూ.10 లక్షలు చెల్లిస్తే.. కోటి రూపాయల వరకు ప్రయోజనాలను పొందే వీలున్నది. అయితే ఇందులో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకదానిలో 1.25 రెట్లు ప్రయోజనం అందితే, రెండోదానిలో 10 రెట్లు అదనంగా పొందవచ్చు.
ఉదాహరణకు 30 ఏండ్ల వ్యక్తి తొలి ఆప్షన్‌లో సింగిల్ ప్రీమియంగా రూ.8,86,750 చెల్లిస్తే (జీఎస్టీతో కలిపితే రూ.9,26,654) రూ.11,08,750 బీమాను అందుకోవచ్చు. ఇందులో 15 ఏండ్ల టర్మ్ పాలసీని ఎంచుకుంటే మెచ్యూరిటీ సమయంలో రూ.21,25,000 తీసుకోవచ్చు. ఒకవేళ పాలసీదారుడు తొలి ఏడాదే చనిపోతే నామినీకి రూ.11,83,438 వస్తాయి. 15వ ఏడాది మరణిస్తే నామినీ రూ.22,33,438 తీసుకోవచ్చు.
రెండో ఆప్షన్‌లో సింగిల్ ప్రీమియంగా రూ.8,34,642 చెల్లిస్తే, కనీస బీమా రూ.10 లక్షలు అందుతాయి. చనిపోతే మాత్రం రూ.79,87,000 వస్తాయి. ఇక ఈ పాలసీలను కనీస వయసుతోనే కొనవచ్చు. అయితే 15 ఏండ్ల టర్మ్ పాలసీ కోసం 3 ఏండ్లు, 10 ఏండ్ల టర్మ్ పాలసీ కోసం 8 ఏండ్లు నిండాలి.
తొలి ఆప్షన్‌కు గరిష్ఠ వయసు 60 ఏండ్లుగా ఉన్నది. రెండో ఆప్షన్ గరిష్ఠ వయసు 10 ఏండ్ల టర్మ్ పాలసీకి 40 ఏండ్లు, 15 ఏండ్ల టర్మ్ పాలసీకి 35 ఏండ్లు. ఈ వయసు దాటితే ఈ పాలసీల కొనుగోలుకు అనర్హులు. ఇక రెండు ఆప్షన్లలోనూ పాలసీదారునికి 18 ఏండ్లు నిండితేగాని మెచ్యూరిటీ అవ్వదు. మెచ్యూరిటీకి గరిష్ఠ వయసు తొలి ఆప్షన్‌కు 75 ఏండ్లు, రెండో ఆప్షన్‌కు 50 ఏండ్లు.