ఆర్బీఐ గణాంకాల వెల్లడి.. సింహభాగం వ్యక్తిగత రుణాలే
విధాత, హైదరాబాద్: ఈ ఏడాది దేశ ప్రజలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి వ్యక్తిగత, వాహన, గృహ, విద్య తదితర పేర్లతో 45,51,584 కోట్లు రుణాలుగా తీసుకున్నారని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. గృహ, వ్యక్తిగత, వాహన, క్రెడిట్ కార్డుల రుణాల్లో 92 శాతం పూచీకత్తు లేని రుణాలు ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ ప్రకటించిన లెక్కల ప్రకారం నవంబర్, 2023 నాటికి రిటైల్ రుణాలు 18 శాతం, వ్యక్తిగత రుణాల్లో 22 శాతం, క్రెడిట్ కార్డుల రుణాల్లో 28 శాతం పెరిగాయి. దేశంలో 94 మిలియన్ల క్రెడిట్ కార్డులు ఉండగా సగటున రూ.5,577 కోట్ల విలువ మేరకు లావాదేవీలు జరిగాయి.
ప్రజలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రూ.1.71 లక్షల కోట్ల మేరకు వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లు ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) ఎలాంటి పూచీకత్తు లేకుండా క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, వినియోగ వస్తువుల కొనుగోలుకు అప్పులు మంజూరు చేశాయి. ఈ విధమైన అప్పులు మంజూరు చేయడంతో రెట్టింపు స్థాయిలో క్యాపిటల్ పెట్టుబడులు సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు ఎన్బీఎఫ్సీలకు ఏర్పడ్డాయి. ప్రధానంగా నాలుగు రంగాలలో అత్యధికంగా రుణాలు పంపిణీ చేశారు. 2023 గృహ రుణాలు రూ.21.44,376 కోట్లు, వాహన రుణాలు రూ.5.53,154 కోట్లు పంపిణీ జరిగింది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం 2021 సంవత్సరంలో రుణాలు రూ.31,99,948 కోట్లు ఉండగా 2022 సంవత్సరానికి 38,55,873 కోట్లుగా ఉన్నది. 2023లో సంవత్సరం నవంబర్ చివరి నాటికి 45,51,584 కోట్ల అప్పులు చేశారు. 2021 సంవత్సరంలో 20.5 శాతం పెరగ్గా, 2022లో 18 శాతం మేర పెరిగాయి.
గృహ రుణాలు 2021లో రూ.16,05,562 కోట్లు ఉండగా, మరుసటి ఏడాది అనగా 2022లో రూ.18,73,413 కోట్లు, 2023లో రూ.21,44,376 కోట్లుగా ఉన్నది. పెరిగింది. వ్యక్తిగత రుణాలు 2021లో రూ.8,24,085 కోట్లు, 2022లో రూ.10,29,723 కోట్లు, 2023లో రూ.12,59,170 కోట్లు ఇచ్చారు. వాహన రుణాలు 2021లో రూ.3,78,026 కోట్లు, 2022లో రూ.4,60,871 కోట్లు, 2023లో 5,53,154 కోట్లు తీసుకున్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు 2021లో రూ.1,45,353 కోట్లు, 2022లో రూ.1,88,033 కోట్లు, 2023లో 2,40,656 కోట్లు తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలు, విద్యా రుణాలు, బంగారం తనఖా రుణాలు, వినియోగ వస్తువుల రుణాలు, సెక్యురిటీ తనఖా రుణాల్లో కూడా పెరుగుదల ఉందరి ఆర్బీఐ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.