44 రోజుల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ బీజేపీ ప్రయోజనానికే?

నలభై నాలుగు రోజులు! ఇదీ రానున్న లోక్‌సభ ఎన్నికల సమరం సాగే సమయం! స్వతంత్ర భారత దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951-52లో నాలుగు నెలలకుపైగా

  • Publish Date - March 18, 2024 / 05:13 PM IST
  • అందుకే షెడ్యూల్‌ను సాగదీసిన కేంద్రం?
  • 44 రోజుల ప్రక్రియ బీజేపీ ప్రయోజనానికే!
  • సమస్యల సుడిగుండాల్లో దేశ ప్రజలు
  • పెను సవాలుగా మారిన నిరుద్యోగిత
  • సంక్షోభంలోనే వ్యవసాయం రంగం
  • రగులుతూనే ఉన్న రైతుల ఆందోళన
  • పేద, మధ్య తరగతి వర్గాలకు ధరల సెగ
  • ప్రజల్లో సజీవంగానే పెద్దనోట్ల రద్దు కష్టాలు
  • దేశాన్ని గుప్పిటపట్టిన అదానీ, అంబానీలు!
  • ప్రభుత్వరంగ సంస్థలు నానాటికీ నిర్వీర్యం
  • బడుగుల రిజర్వేషన్లను మింగిన ప్రైవేటీకరణ
  • ఇష్టారాజ్యంగా విపక్ష ప్రభుత్వాల కూల్చివేత
  • రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్రం
  • రాబోయే ఎన్నికల్లో ఇవన్నీ బీజేపీకి సవాళ్లే
  • వాటినుంచి ప్రజల దృష్టి మళ్లించే యత్నాలు
  • ఉన్న మార్గం అయోధ్య రామనామ జపం
  • మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్లాన్‌
  • వాటికోసమే సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ?
  • రాజకీయ పరిశీలకుల్లో జోరుగా చర్చలు

విధాత ప్రత్యేకం: నలభై నాలుగు రోజులు! ఇదీ రానున్న లోక్‌సభ ఎన్నికల సమరం సాగే సమయం! స్వతంత్ర భారత దేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1951-52లో నాలుగు నెలలకుపైగా ఏకంగా 68 దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తే.. ఇప్పుడు దాని తర్వాత అత్యంత సుదీర్ఘ సమయం ఇదే! 1980లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల‌ను నాలుగు రోజుల్లోనే ముగించేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌ను ప‌రిశీలిస్తే అత్యంత త‌క్కువ కాలం ఇదే. 2004లో నాలుగు ద‌శ‌ల‌కు 21 రోజుల స‌మ‌యం ప‌ట్టింది. 2009లో ఐదు ద‌శ‌లు నెలపాటు కొన‌సాగాయి. 2014లో తొమ్మిది ద‌శ‌ల్లో 36 రోజులపాటు ఎన్నిక‌లు నిర్వ‌హించారు. 2019లో 39 రోజుల పాటు ఏడు ద‌శ‌ల్లో నిర్వ‌హించారు. ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. పనులన్నీ చిటికెలో అయిపోతున్నాయి. అయినా.. ఎందుకు ఈ సుదీర్ఘకాలం? శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికేనా? వేరే ప్రయోజనాలు ఉన్నాయా? లేక రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయంపై అపనమ్మకంతోనా?

ఎన్నికలకు ముందే హడావుడి..

నిజానికి లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కారు పెద్ద హడావుడే చేసింది. అయోధ్యలో రామ మందిరం ఆగమేఘాలపై నిర్మించి.. సంప్రదాయాలు పాటించకుండా దాన్ని ప్రారంభించిందనే విమర్శలు మూటగట్టుకున్నది. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే ఇంత హడావుడి చేసిందనేది అందరికీ అర్థమవుతున్న విషయమే. అంతకు ముందు 370 ఆర్టికల్‌ రద్దు చేసింది. ఎప్పుడో అమల్లోకి వచ్చే మహిళా బిల్లును ఇప్పుడు ఆమోదించి.. అదేదో గొప్పగా చాటుకున్నది. ఇవన్నీ తమను ఎన్నికల గండాన్ని గట్టెక్కిస్తాయనేది బీజేపీ తొలి అంచనాగా కనిపిస్తున్నది. ముందు ఇంత హడావుడి పడినా.. అసలు సమయం వచ్చేసరికి ఎన్నికల సమయాన్ని ఇంతగా ఎందుకు సాగదీశారు?

పీడిస్తున్న సమస్యలు

ఈ పదేళ్లకాలంలో దేశం ఎన్నో శిఖరాలు అధిరోహించిందని మోదీ భక్తులు చెప్పుకొన్నా.. ఈసారి 400 సీట్లు ఎన్డీయేకు కట్టబెట్టేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని మోదీ ప్రకటించేసుకున్నా.. రాబోయే ఎన్నికల్లో గెలుపు అంత ఆషామాషీ కాదనే విషయం బీజేపీ అధినాయకత్వానికి అవగతమైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి ఈ పదేళ్ల కాలంలో దేశ ప్రజలు అనేక చేదు అనుభవాలు చవి చూశారు. పెద్ద నోట్ల రద్దు మొదలు.. మొన్నటి నల్ల వ్యవసాయ చట్టాలు, తాజాగా అగ్నిపథ్‌.. ఇలా అన్నీ ప్రజలను ఇబ్బంది పెట్టేవే. ఇబ్బంది పెడుతున్నవే. ఏటా రెండు కోట్ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ, ఈ ఎనిమిదేళ్ల కాలంలో చేప‌ట్టిన నియామ‌కాలు సుమారుగా ఏడు లక్షలు ఉండవచ్చని అంచనా. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభలో అధికారికంగా ప్రకటించారు. వీటి పర్యవసానాలు తమకు సానుకూలంగా ఉంటాయనే నమ్మకం బీజేపీలో నిపించడం లేదని చెబుతున్నారు.

కకావిలకమైన ఆర్థిక వ్యవస్థ

దేశ సంప‌ద‌ను అదానీ, అంబానీలకే మోదీ ప్రభుత్వం కట్టబెట్టిందనే విమర్శలున్నాయి. ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌న్నీ బీజేపీ ప్ర‌భుత్వ విధాన నిర్ణ‌యాల‌తో కుప్ప‌కూలిపోయాయి. ప్రభుత్వ రంగ సంస్థలను వాటిని విలువ కంటే తక్కువ ధరకు తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు వెనకాడటం లేదు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ పరం కావడంతో అక్కడి ఉద్యోగాల్లో రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలు కోల్పోయారు. దేశంలో ఎన్న‌డూలేని విధంగా 40 ఏండ్ల గ‌రిష్ఠానికి నిరుద్యోగం పెరిగింది. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ద్ర‌వ్యోల్బ‌ణం విప‌రీతంగా పెర‌గ‌డంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జానీకం కొనుగోలు శ‌క్తి పూర్తిగా క్షీణించింది. స‌బ్సిడీలు ఎత్తివేసి, ఎరువుల ధ‌ర‌లు పెంచ‌డంతో వ్య‌వ‌సాయ రంగం సంక్షోభంలోకి వెళ్లింది. బీజేపీ యేత‌ర‌ రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల రాజ‌కీయ జోక్యంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల సంబంధాలు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. స‌మాఖ్య‌స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల అధికారాలు, హ‌క్కుల‌ను హ‌రించే విధంగా మోడీ ప్ర‌భుత్వం విధాన నిర్ణ‌యాలు తీసుకున్నది. ఆనకట్టల పరిరక్షణ బిల్లు, రైతు చట్టాలు, విద్యుత్ నియంత్రణ బిల్లులు తీసుకొచ్చి నీటి వనరులు, వ్యవసాయం, విద్యుత్ రంగాలను రాష్ట్రాల పరిధిలో నుండి లాగేసుకుంది. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇన్ని వైఫల్యాల నేపథ్యంలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి గతం కంటే ఎక్కువగా ఏకంగా 400 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నది. కానీ.. దేశంలో అలముకున్న సమస్యల రీత్యా పైపై ప్రసంగాలతోనూ, అయోధ్య రాముడితోనో గెలుపు సాధ్యమయ్యే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇండియా కూటమితో గట్టి సవాలు!

బీజేపీ నిలువరించడానికి ఇండియా కూటమి సన్నద్ధమైంది. యూపీ, మహారాష్ట్ర, బీహార్‌, పంజాబ్‌, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో భాగస్వామ్యపార్టీలతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమి విచ్ఛిన్నానికి బీజేపీ అధినాయకత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా.. ఒక్క నితీశ్‌ నిష్ర్కమణ మినహా పకడ్బందీగానే ఉన్నది. కొన్ని రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటులో ఇబ్బంది ఎదురైనా.. అక్కడ మోదీని స్థానిక పార్టీలు సమర్థంగా ఎదుర్కొనే స్థితిలోనే ఉన్నాయి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మరింత ప్రచార సమయం కావాలని భావించిన కేంద్ర ప్రభుత్వం.. దానికి అనుగుణంగానే పోల్‌ షెడ్యూల్‌ను ఖరారు చేయించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోదీనే నమ్ముకుని, వీలున్న చోటుకల్లా ఆయనను తీసుకుపోయి.. భావోద్వేగ ఉపన్యాసాలు ఇప్పించేందుకు ఈ సమయాన్ని వెచ్చించాలని భావిస్తున్నారని అంటున్నారు. అందుకే షెడ్యూల్‌ను సాగదీశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.