మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. 48గంటల్లో మీ ప్రభుత్వం కూలుతుంది

తనతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు

  • Publish Date - March 30, 2024 / 09:00 AM IST

  • మీలాంటి మంత్రులు ఐదుగురు మాతో టచ్‌లో ఉన్నారు
  • మంత్రి వెంకట్‌రెడ్డిపై భగ్గుమన్న బీజెఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
  • విచారణల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి వసూళ్లు

విధాత, హైదరాబాద్‌ : తనతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మా పార్టీ ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డా…48గంటల్లో మీ ప్రభుత్వం కూలిపోతది బిడ్డా అని వార్నింగ్ ఇస్తున్నామన్నారు. మేం హుందగా ఉన్నామని, ప్రజా తీర్పును గౌరవిస్తు మీ ప్రభుత్వ పాలనకు సహకరిస్తున్నామని, మీరు గమ్మున ఉండాలన్నారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ ఉండదని అన్నారు.

 

గడ్కరీ, అమిత్ షాల వద్దకు పోయి నేను ఏక్‌నాథ్ షిండే పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని నీవు చెప్పుకోలేదా అని వెంకట్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. అయినా మేం నీకు షిండే పాత్ర ఇవ్వడం లేదన్నారు. మా హైకమాండ్‌తో టచ్‌లో ఉన్నది నీవు అని, అలాంటి నీవు మా ఎమ్మెల్యేలు నీతో టచ్‌లో ఉన్నారని చెబుతావా అంటు మహేశ్వర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మీలాంటి ఐదుగురు కాంగ్రెస్ మంత్రులు మాతో టచ్‌లో ఉన్నారని, అయినా ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. మీ తమ్ముడి భార్యకు ఎంపీ టికెట్ రాకుండా అడ్డుపడ్డావని,…నీకు మీ తమ్ముడే టచ్‌లో లేరని, అలాంటిది మా బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అవాకులు పేలుతావా అంటు వెంకట్‌రెడ్డిపై మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.

 

గతంలో పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడేందుకు ఇతర పార్టీల వారిని కొనుగోలు చేసి మీ పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. అక్రమాలపై విచారణ పేరుతో భయపెట్టి సీఎం రేవంత్‌రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నాడని మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రాహుల్ టాక్స్ పేరుతో 3వేల కోట్లు వసూలు చేశాడని, రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఆరోపించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై గతంలో రేవంత్ చేసిన ఆరోపణలు ఏమయ్యాయని, అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన సీఎం ఇప్పుడు ఎన్నికల్లో ఆయనకు ఓటు వేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు.

Latest News