Site icon vidhaatha

Malkapeta Reservoir | మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్‌ రన్‌ సక్సెస్

Malkapeta Reservoir |

విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు నీరు అందించే ఉద్దేశంతో కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజీ 9 కింద కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 3 టీఎంసీ సామర్థ్యం గల మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మల్కపేట రిజర్వాయర్‌ ట్రయల్ రన్ ను చేపట్టేందుకు అధికారులు పక్షం రోజులుగా క్షేత్ర స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.

అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ పంపుహౌస్‌లో మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను మంగళవారం ఉదయం 7.00 గంటలకు మల్కపేట జలాశయంలోకి ఎత్తి పోశారు. ట్రయల్ రన్ పనులను ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎన్.వెంకటేశ్వర్లు, ఎత్తి పోతల సలహాదారు పెంటారెడ్డి, MRKR,WPL ఏజెన్సీల ప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షణ చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ట్రయల్ రన్ పై అధికారులను ఆరాతీస్తూ సజావుగా జరిగేలా మార్గనిర్దేశం చేశారు. ప్యాకేజీ -9 కార్యనిర్వహక ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి ట్రయల్ రన్ సమన్వయ బాధ్యతలు చూశారు. మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో 60 వేల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు 26,150 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కానుంది.

మల్కపేట రిజర్వాయర్ నిర్మాణంతో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలలోని రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటిసమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. బీడు భూముల సస్యశ్యామలం కానున్నాయి. రూ.504 కోట్లతో చేపట్టిన మల్కపేట రిజర్వాయర్‌ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.

నీటిని ఇలా తరలిస్తారు

కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్, ఎల్లారెడ్డిపేట మండలం సింగసముద్రంకు ఇక్కడి నుండి నీటిని తరలిస్తారు. ఎందుకోసం 40 కిలోమీటర్ల మేర కాల్వలను తవ్వించారు. మధ్య మానేరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్ కు నీటి సరఫరా జరుగుతుంది.

సిరిసిల్ల,చంద్రంపేట, రగుడు, కొలనూరు, మల్కపేట గ్రామాల మీదుగా భూగర్భ సొరంగం ద్వారా నీటిని తరలిస్తారు. ఇందుకోసం మధ్య మానేరు నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో రామప్ప గట్టు వద్ద హెడ్ రెగ్యులేటరీని నిర్మించారు. 130 మీటర్ల లోతులోంచి 1100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేందుకు పంపు హౌస్ లో 30 మెగావాట్ల చొప్పున రెండు మోటార్లు అమర్చారు. మోటార్లు రన్ చేయడానికి 33/11 కె.వి సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.

Exit mobile version