Mallikarjun Kharge
- సగటు భోజనం ధర 24% పెరిగింది
- దేశంలో నిరుద్యోగిత 8శాతంగా ఉన్నది
- అగమ్యగోచరంగా యువత భవిష్యత్తు
- మళ్లీ మణిపూర్‌లో మొదలైన హింస
- సమస్యలనుంచి దృష్టిమళ్లించడం కాదు..
- వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి
- ప్రధాని మోదీకి కాంగ్రెస్ నేత ఖర్గే సూచన
న్యూఢిల్లీ : జీ20 హడావుడి ముగిసినందున ఇకనైనా దేశం ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, మణిపూర్ హింస వంటి సమస్యలపై దృష్టిసారించాలని ప్రధాని నరేంద్రమోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టిన ఖర్గే.. నిత్యవసర వస్తువుల ధరలు, నిరుద్యోగిత పెరగడంపై కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. వాస్తవాలను గుర్తించేందుకు మోదీ నిరాకరిస్తున్నారని అన్నారు.
కానీ.. సమస్యల నుంచి దృష్టి మళ్లించే బదులు.. వాస్తవాలను చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ‘ఇప్పుడు జీ20 సదస్సు ముగిసింది. ఇకనైనా దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించాలి. ద్రవ్యోల్బణం : ఆగస్ట్ నెలలో సగటు భోజనం ధర 24శాతం పెరిగింది. నిరుద్యోగిత: దేశంలో నిరుద్యోగిత 8 శాతంగా ఉన్నది. యువత భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉన్నది’ అని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ దుష్పరిపాలనలో అవినీతి వరదలా పోటెత్తుతున్నదని ఖర్గే విమర్శించారు. అనేక నివేదికల్లో బీజేపీ సర్కారును కాగ్ ఎండగట్టిందని పేర్కొన్నారు.
కశ్మీర్‌లో జల్‌జీవన్ స్కీంలో 13వేల కోట్ల అవినీతి చోటు చేసుకున్నదని, ఈ అవినీతిని బయటపెట్టిన దళిత ఐఏఎస్ అధికారి వేధింపులకు గురవుతున్నారని అన్నారు. ప్రధాని ఉత్తమ స్నేహితుడి దోపిడీ తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చిందని ఖర్గే ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు ముందు మూడు లక్షల కోట్ల రూపాయలను ఆర్బీఐ ట్రజరీ నుంచి మోదీ ప్రభుత్వంలోకి మళ్లించేందుకు వచ్చిన ఒత్తిళ్లను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య నిరోధించినట్టు ఇప్పుడు బయటకు వస్తున్నదని పేర్కొన్నారు.
గత కొద్ది రోజులుగా మణిపూర్‌లో మళ్లీ హింస మొదలైందని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కొంటుంటే.. అహంకారపూరిత మోదీ ప్రభుత్వం దానిని జాతీయ విపత్తుగా గుర్తించేందుకు నిరాకరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇన్ని జరుగుతున్నా వాస్తవాలను గుర్తించేందుకు మోదీ నిరాకరిస్తున్నారు. కానీ.. సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలకు బదులు వాస్తవాలు చూడాలని, వినాలని ప్రజలు కోరుకుంటున్నారు. మోదీ ప్రభుత్వం శ్రద్ధగా వినాలి. మిమ్మల్ని 2024 ఎన్నికల్లో సాగనంపేందుకు దేశ ప్రజలు సిద్ధమవుతున్నారు’ అని ఖర్గే పేర్కొన్నారు.