పేదల వ్యతిరేకులు మోడీ, కేసీఆర్‌లు: ఖర్గే

ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ పేద వర్గాల వ్యతిరేక పాలకులని, వారిద్దరూ ధనవంతుల కొమ్ము కాస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు

  • Publish Date - November 25, 2023 / 10:27 AM IST
  • కాంగ్రెస్‌తోనే బడుగుల సంక్షేమం
  • ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే


విధాత: ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ పేద వర్గాల వ్యతిరేక పాలకులని, వారిద్దరూ ధనవంతుల కొమ్ము కాస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆరోపించారు. శనివారం సనత్‌నగర్‌, బన్సిలాల్‌పేట ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వస్తేనే పేదలు, బడుగు వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత దక్కుతుందన్నారు.


పేదల ఖాతాల్లో మోడీ రూ. 15 లక్షలు వేస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేస్తే, రాష్ట్రంలో అలాంటి హామీలే ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని, ఆప్ సర్కార్‌తో కుమ్మక్కై మద్యం కుంభకోణం సాగించారన్నారు. కుమార్తె కవితను కాపాడుకునేందుకే సీఎం కేసీఆర్ ప్రధాని మోడీతో చేతులు కలిపారన్నారు.


మోడీ, కేసీఆర్‌లు వేర్వేరు కాదన్నారు. రాష్ట్రంలో బీఆరెస్‌ ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఖాళీలుగా ఉంచిందని, వాటిని భర్తీ చేస్తే పేదల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వొచ్చన్నారు. తాము అధికారంలోకి రాగానే వాటిని భర్తీ చేస్తామన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో పేదలు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ పడుకుంటున్నారని, ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరముందన్నారు.


హైదరాబాద్లో నెహ్రూ కాలంలోనే బీహెచ్ఈఎల్ వంటి సంస్థలు తీసుకువస్తే వాటిని మోడీ అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హాయంలోనే హైద్రాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాణలో అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు కాలం చెల్లిందని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీలన్నింటిని అమలు చేస్తుందన్నారు.