న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై సస్పెన్ష్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం పీఠం కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ ఊహాగానాలకు మంగళవారం సాయంత్రం నాటికి తెరపడే అవకాశంఉంది.
పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గే సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఖర్గేతో భేటీ కానున్నారు. ఇప్పటికే తెలంగాణలో నెలకొన్న పరిణామాలపై ఖర్గే సహా కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి డీకే శివకుమార్ సమాచారం అందించారు.
మరో వైపు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇవాళ ఉదయం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. వీరిద్దరితో కూడా ఖర్గే సమావేశం కానున్నారు. మొత్తానికి సీఎం ఎవరనే అంశంపై మంగళవారం సాయంత్రానికి స్పష్టత రానుంది.