ఆగలేక.. విమానంలో టాయ్‌లెట్‌లో వ్యక్తి చేసిన పని..

పొగతాగే అలవాటు ఉన్నవారికి టైమ్‌ ప్రకారం దమ్ము కొట్టనిదే ఊపిరిసలపదు. ఇలాంటి ఒకాయన మంగళవారం ఏకంగా విమానం గాల్లో ఉన్నప్పుడే టాయ్‌లెట్‌కు వెళ్లి బీడీ వెలిగించాడు

  • Publish Date - March 6, 2024 / 08:32 AM IST

పొగతాగే అలవాటు ఉన్నవారికి టైమ్‌ ప్రకారం దమ్ము కొట్టనిదే ఊపిరిసలపదు. ఇలాంటి ఒకాయన మంగళవారం ఏకంగా విమానం గాల్లో ఉన్నప్పుడే టాయ్‌లెట్‌కు వెళ్లి బీడీ వెలిగించాడు. పసిగట్టిన సిబ్బంది ఫిర్యాదులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకున్నది. బీడీ కాల్చిన వ్యక్తిని మహ్మద్‌ ఫక్రుద్దీన్‌ (42)గా గుర్తించారు. ఆయన ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో వస్తున్నాడు. మధ్యలో టాయ్‌లెట్‌కు వెళ్లిన ఫక్రుద్దీన్‌.. అక్కడే బీడీ వెలిగించాడు. బీడీ పొగ వాసన రావడాన్ని గమనించిన విమాన సిబ్బంది.. టాయ్‌లెట్‌ను పరీక్షించగా.. అక్కడ కాల్చిపడేసిన బీడీ కనిపించింది. ఫక్రుద్దీన్‌ అనే వ్యక్తిపై అనుమానం వచ్చి ప్రశ్నించగా.. అతడు తాను చేసిన పనిని ఒప్పుకొన్నాడు. కాసేపటికి విమానం ముంబైలో ల్యాండ్‌ అవగానే.. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ 336 సెక్షన్‌, ఇతర విమానయాన చట్టాల్లోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

గత ఏడాది మే నెలలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. 56 ఏళ్ల వ్యక్తి ఒకరు.. విమానంలోని టాయ్‌లెట్‌లో బీడీ తాగడంతో అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని మర్వార్‌ ప్రాంతానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి.. అహ్మదాబాద్‌లో అలాస్కా ఎయిర్‌ విమానం ఎక్కాడు. టాయ్‌లెట్‌లో బీడీ కాల్చుతూ కనిపించాడు. అయితే.. తనకు విమాన ప్రయాణం ఇదే మొదటిసారి అని, విమాన ప్రయాణ నిబంధనలు తనకు తెలియవని మొత్తుకున్నా.. పోలీసులు మాత్రం తమ పనితాము చేసుకుపోయారు

Latest News