సంఘవిద్రోహ శక్తులకు సహకరించొద్దు : మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్

రాబోయే ఎన్నికల్లో ప్రజలు సంఘవిద్రోహశక్తులకు సహకరించవద్దని,మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కోరారు

  • మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: రాబోయే ఎన్నికల్లో ప్రజలు సంఘవిద్రోహశక్తులకు సహకరించవద్దని, మావోయిస్టుల ప్రలోభాలకు లొంగకుండా గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కోరారు. సోమవారం ఆయన ఉమ్మడి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలింగ్ స్టేషన్లు, ఫెర్రీ పాయింట్లను పరిశీలించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు వాహనాల తనిఖీచెక్ పోస్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. అనంతరం ఎన్నికల భద్రతా చర్యల్లో భాగంగా మంచిర్యాల జిల్లా నీల్వయి పోలీస్ స్టేషన్ పరిధిలోని జజులపేట, సంపుటం, వేమనపల్లి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బందికి తగు జాగ్రత్తలు సూచించారు.

వేమంపల్లి లోని ఫెర్రీ పాయింట్ వద్ద అక్కడ పడవలు నడిపే వారితో మాట్లాడారు. అటువైపుగా వెళ్తున్న కొంతమంది ప్రయాణికులను, వారి వస్తువులను తనిఖీ చేశారు. కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పంగిడీ సోమరం, అన్నారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదని సూచించారు. ప్రజలు అసాంఘిక శక్తులకు సహకరించవద్దన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

ఎవరైనా కొత్త వారు వస్తే ఆశ్రయం ఇవ్వవద్దన్నారు. మావోయిస్టుల ప్రలోభాలకు ఆకర్షితులు కావద్దన్నారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే పోలీసుల ధ్యేయమన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద ఎదురైనా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు. మహారాష్ట్ర నుండి మన వైపు డబ్బులు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఇతర వస్తువులు, మద్యం రాకుండా తనిఖీలను నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ప్రతి వాహనాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. వాహనాల తనిఖీల సమయంలో వీడియోగ్రఫీ తీసుకోవాలని అన్నారు. ఆయా తనిఖీల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వారి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ మోహన్, చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్, కోటపల్లి ఎస్ఐ సురేష్, నీల్వాయి ఎస్సై సుబ్బారావు, టీఎస్ఎస్పీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.