రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మండవ

మాజీ మంత్రి, బీఆరెస్ నేత మండవ వెంకటేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు

  • Publish Date - November 25, 2023 / 12:41 PM IST
  • రాజకీయ మార్పు కోసం పార్టీ మార్పు


విధాత : మాజీ మంత్రి, బీఆరెస్ నేత మండవ వెంకటేశ్వర్‌రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బోధన్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మండవ వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ రాజకీయ మార్పు అనివార్యమైన పరిస్థితిలోనే పార్టీ మారడం జరిగిందన్నారు. పార్టీ మారడం ఆవేశంతో తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు.


తెలంగాణలో మార్పు కోసం ప్రతి ఓటర్ భాగస్వామ్య కావాలని మండవ వెంకటేశ్వరరావు కోరారు. మలి విడత తెలంగాణ ఉద్యమంలో 360 మంది, రెండో విడతలో 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ఆత్మబలిదానాలను చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన అందరూ కేసీఆర్‌ను నిందిస్తున్నారని తెలిపారు.


ప్రశ్నించే వ్యక్తిని అణిచివేసే వ్యక్తిగా కేసీఆర్ నిలిచారన్నారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతోందన్నారు. ఉద్యోగస్తులకు 15వ తేదీ వరకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు ఐదు లక్షల కోట్ల అప్పు ఎట్లా అయిందన్నారు. ధరణి నష్టదాయకంగా తయారైందన్నారు. గతంలో రైతుబందు రూ.12000లకే సీఎం కేసీఆర్ భారమన్నారని, మరి ఇప్పుడు రూ.16,000 ఎక్కడి నుంచి తెచ్చేస్తారని ప్రశ్నించారు.