SP PAWAR |
- బీఆర్ఎస్ సర్కారు ముందు జాగ్రత్త
- నూతన ఎస్పీగా గుండేటి చంద్రమోహన్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంత ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నారో మానుకోట జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఆకస్మిక బదిలీని ఉదహరిస్తున్నారు. మానుకోట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శరత్ చంద్రపవార్ పైన ఉన్నట్టుండి సోమవారం బదిలీవేటు వేశారు. ఆయన స్థానంలో ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను నియమించారు.
గతంలో మానుకోటలో ఎస్పీగా పనిచేసిన కోటిరెడ్డి బదిలీ తర్వాత ఏరికోరి శరత్ చంద్రపవార్ కు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు రాత్రికి రాత్రే బదిలీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ మార్పు వెనుక రాజకీయ కారణాలున్నట్లు బహిరంగంగానే చర్చ సాగుతోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రతీ నియోజకవర్గం, జిల్లాల స్థాయి అధికారుల నియామకంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అట్లాంటిది నిన్నటి వరకు బదిలీ లిస్టులోలేని ఎస్పీని తప్పించడం వెనుక అవసరమైనకంటే ఎక్కువ జాగ్రత్త ఉందంటున్నారు.
ఎమ్మెల్యే అల్లుడు కావడంతో..
మానుకోట ఎస్పీ పవార్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్ కుమార్తెను పెళ్ళి చేసుకున్నారు. రేఖానాయక్ అల్లుడు కావడమే ఈ ఆకస్మిక బదిలీకి కారణంగా చెబుతున్నారు. సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్ కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం అవకాశం నిరాకరించింది. ఆమె స్థానంలో కేటీఆర్ స్నేహితుడు భూక్యా జాన్సన్ రాథోడ్ కు అవకాశం కల్పించారు. దీనిపై ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు చేశారు.
రేఖానాయక్, ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం మీద తిరుగుబాటు చేసిన రేఖా నాయక్ కు పవార్ అల్లుడుకావడంతో రానున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా వ్యవహరించకపోవచ్చని ఆయనను బదిలీచేసినట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, సూచనల మేరకు రెండేళ్ళకు పైబడి ఒకే చోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేస్తున్నారు. రెండేళ్ళు పూర్తి కానందున తమ అనుకూలుడని ముందు ఆయనను పట్టించుకోలేదు. తాజా పరిణామాలతో బదిలీ చేయకతప్పలేదు.
కొత్త ఎస్పీగా చంద్రమోహన్
దేవరకొండ డీఎస్పీగా, కరీంనగర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పని చేశారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా పనిచేసి ఇటీవలే నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైదరాబాదులోని డీజీపీ కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.