Chhattisgarh | మావోయిస్టుల చేతిలో బీజేపీ నేత హత్య

పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా ముందు రోజు మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఒక బీజేపీ నేతను హత్య చేశారు.

  • Publish Date - April 18, 2024 / 04:55 PM IST

పోలింగ్‌కు ముందు బస్తర్‌ జిల్లాలో ఘటన

నారాయణ్ పూర్/బస్తర్ : పార్లమెంట్ ఎన్నికలకు సరిగ్గా ముందు రోజు మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలోని నారాయణ్‌పూర్‌ జిల్లాలో ఒక బీజేపీ నేతను హత్య చేశారు. బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో మావోయిస్టులు దండవాన్ గ్రామ ఉప సర్పంచ్, బిజెపి స్థానిక నాయకుడు పంచం దాస్‌పై మారణాయుధాలతో దాడి చేసి హత్య జేశారు. ఆ తరువాత శవాన్ని రోడ్డుపై పడవేశారు.

ఈ ఘటన అనంతరం మావోయిస్టులు అ చుట్టుపక్కల అనేక చోట్ల బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు కూడా వేశారు. పంచం దాస్ ప్రజా వ్యతిరేకి అని, అవినీతికి, లంచగొండితనానికి ఆయన పేరుమోసిన వాడని ఆరోపిస్తూ.. ఇవన్నీ బయటకు రాకుండా వుండటానికి పోలీసు ఇన్ ఫార్మర్‌గా కూడా పని చేస్తున్నాడని కరపత్రాలు, పోస్టర్లలో పేర్కొన్నారు. ఎన్నికలను బహిష్కరించాలనే నినాదాలను కూడా బ్యానర్లలో రాశారు.

ఈ ఘటన తరువాత చుట్టుప్రక్కల గ్రామాలలో పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ పెంచినట్లు ఎస్పీ తెలిపారు. అయితే మంగళవారం పోలీసులతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతిచెందిన దానికి ప్రతికారంగా బిజెపి నాయకున్ని హత్య జేసినట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రెండు సంవత్సరాలలో కనీసం ఆరుగురు బీజేపీ నాయకులను మావోయిస్టులు హతమార్చారు.

Latest News