విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు జిల్లాలో మావోయిస్టులు, పోలీసుల మధ్య భారీ ఎన్ కౌంటర్ తప్పిపోయింది. జిల్లాలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో 30 నుంచి 40 మంది మావోయిస్టులు సమావేశమయ్యారనే పక్కా సమాచారంతో పోలీసులు బుధవారం నుంచి కూంబింగ్ చేపట్టారు.
రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ సంఘటన జరిగింది. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల స్పెషల్ పార్టీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. కాగా, పోలీసుల రాకను గమనించిన మావోలు చాకచక్యంగా తప్పించుకున్నారు.
అగ్ర నేతలు వీరే..
సంఘటనా స్థలం నుంచి తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. పుల్లూరి ప్రసాద్ అలియాస్ చంద్రన్న, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి, మైలారపు అడేలు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ ఉన్నట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు.
మావోయిస్టుల సామగ్రి స్వాధీనం
ఘటనా స్థలం నుంచి కిట్ బ్యాగులు, ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లు, సుతిల్ బాంబు, రేడియోలు, సోలార్ ప్లేట్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు, పాత్రలు, కిరాణా వస్తువులు, దోమ తెరలు, మావోయిస్టు విప్లవ సాహిత్యం, మందులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఇంకా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఎలక్షన్లే లక్ష్యంగా మావోయిస్టులు
రాబోవు ఎన్నికలే లక్ష్యంగా కుట్రకు శ్రీకారం చుట్టే క్రమంలో తిప్పికొట్టినట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ములుగు జిల్లాలో మావోయిస్టులను అడుగు పెట్టనివ్వమని ఆయన హెచ్చరించారు. తెలంగాణాలో మావోయిస్టులు ఏదో అలజడి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.
ఈ సమాచారంతో జాయింట్ ఆపరేషన్ చేపట్టగా మావోయిస్టులు పసిగట్టి కాల్పులు జరుపగా పారిపోయారని ఎస్పీ పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు మావోయిస్టులకు సహకరించొద్దని, వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని ఎస్పీ సూచించారు.
ములుగు జిల్లాలో హై అలర్ట్
ములుగు జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ములుగు జిల్లాలో తృటిలో భారీ ఎన్‌కౌంటర్ తప్పింది. ఈ నేపథ్యంలో పోలీసులు ములుగు అటవీ ప్రాంతంలో భారీఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో గురువారం మంత్రుల పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు ములుగు జిల్లాలో పెద్దఎత్తున జల్లెడబడుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంపై డేగ కళ్ల నిఘా కొనసాగిస్తున్నారు. భారీఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. దీంతో మారుమూల పల్లెలు, గిరిజన గూడాలు వణికి పోతున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.
ములుగులో మంత్రుల పర్యటన
ములుగు జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు గురువారం ముహూర్తం నిర్ణయించారు. ములుగు నియోజకవర్గం ఆనుకుని ఉన్న నర్సంపేట కేంద్రంలో కూడా మంత్రుల కార్యక్రమం ఉంది. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మాలోతు కవి ,ఎమ్మెల్యేలు సీతక్క, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ములుగు అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ తప్పిపోవడంతో అధికార పార్టీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు. మావోయిస్టు కదలికల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.