దమ్ముంటే ఎన్నికల కమిషన్‌కు బాండ్ రాసివ్వాలి: మంత్రి జగదీశ్ రెడ్డి

ప్రజలకు బాండ్ పేపర్లు రాసిస్తూ మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల కమిషన్ కి బాండ్ రాసివ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు

  • Publish Date - November 28, 2023 / 09:19 AM IST
  • కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీశ్ రెడ్డి సవాల్
  • 6 గ్యారంటీలపై నమ్మకంలేక 42 పేజీల గ్యారంటీని తెచ్చారు
  • బీఆరెస్ కు కేసీఆర్ నోటి మాటే గ్యారంటీ


విధాత, సూర్యాపేట: ప్రజలకు బాండ్ పేపర్లు రాసిస్తూ మభ్యపెడుతున్న కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ఎన్నికల కమిషన్ కి బాండ్ రాసివ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సవాల్ విసిరారు. సూర్యాపేటలో మంగళవారం మీడియాతో మాట్లాడిన మంత్రి, కాంగ్రెస్ 6 గ్యారంటీలపై నమ్మకంలేక 42 పేజీల గ్యారంటీని తెచ్చారని ఎద్దేవా చేశారు. దాన్ని కూడా ప్రజలు నమ్మడంలేదని, బాండ్ పేపర్లు రాసిస్తూ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. హామీలు అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని రద్దు చేయమని బాండ్ ఇవ్వాలి అని సవాల్ విసిరారు.


ఇలాంటి బాండ్లు కర్ణాటకలో కూడా రాసిచ్చి పత్తాలేకుండా పోయి మొహం చాటేశారని విమర్శించారు. హామీలు అమలు చేయమని కర్ణాటకలో రైతులు వెంటబడితే పారిపోయారన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణాలో సైతం ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గ్యారంటీ బాండ్ రాసివ్వమని ప్రజలు అడగడంలేదు.. కేసీఆర్ లాంటి నమ్మకమైన వ్యక్తి చెబితే చాలు అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ లాగా మాది కాగితాల గ్యారంటీ కాదు.. కేసీఆర్ నోటి మాటే గ్యారంటీ అన్నారు. నోటి మాట గ్యారంటీ లేక కాగితాల గ్యారంటీ ఇస్తున్నా ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించరని అన్నారు. అన్ని రకాలుగా మేలు చేసిన కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జగదీశ్ రెడ్డి అన్నారు.