రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు?: మంత్రి కేటీఆర్

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండో ఎవ్వరికీ అర్థం కావడం లేదని, డబ్బు మదంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

  • Publish Date - November 22, 2023 / 10:23 AM IST
  • డబ్బు మదంతో కోమటిరెడ్డి సోదరులు
  • ఎన్నికల్లో ఓడించి బుద్ది చెప్పాలి
  • మునుగోడులో ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం
  • చౌటుప్పల్ రోడ్ షోలో మంత్రి కేటీఆర్


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేసిండో ఎవ్వరికీ అర్థం కావడం లేదని, డబ్బు మదంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నాడని మంత్రి కేటీఆర్ విమర్శించారు. చౌటుప్పల్ లో బుధవారం బీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం మంత్రి కేటీఆర్ ప్రచారం చేశారు.


ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడారు. మునుగోడులో గెలుస్తునం.. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 3 నాడు గెలుస్తున్నాడని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మునుగోడు ప్రజలు ఫ్లోరైడ్ తో బాధలు పడ్డారని, అలాంటి కాంగ్రెస్ మళ్ళీ వచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నదన్నారు.


ఉద్యమ సమయంలోనే ఫ్లోరైడ్ ప్రాంతాల్లో పర్యటించానని, ఇవ్వాళ ఇంటింటికి మంచి నీళ్ళు అందిస్తున్నామన్నారు. సురక్షిత నది జలాలు అందిస్తూ, ఫ్లోరైడ్ ను అంతం చేసింది బీఆరెస్ ప్రభుత్వమే అన్నారు. అన్నదాతలకు రైతు బంధు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి సోదరులకు కరంట్ కనబడటం లేదు… కాంగ్రెస్ వాళ్లు కరంట్ వైర్లు పట్టుకోవాలి.. అప్పుడు కరంట్ వస్తుందో లేదో తెలిస్తుందన్నారు.


ఉత్తమ్, రేవంత్, భట్టి… ధరణి వద్దు, రైతు బంధు వద్దు అంటున్నారని, కరెంట్ కావాలంటే బీఆరెస్ రావాలి.. కరంట్ వద్దు అనుకుంటే కాంగ్రెస్ కు ఓటెయ్యాలి అని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3 తర్వాత సౌభాగ్య లక్ష్మీ పథకం కింద 3 వేలు పెన్షన్, వృద్ధులకు 5 వేలు అందిస్తామన్నారు. సిలిండర్ ను రూ400కే అందిస్తామని, అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


నేతన్నలను చేనేత మిత్ర కింద 5 వేలు, రేషన్ కార్డ్ ఉన్న వాళ్లకు సన్న బియ్యం, బీమా, చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ, ఆసుపత్రి నిర్మిస్తామని, మునుగోడు మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మునుగోడును దత్తత తీసుకున్న… ఇంకా చేయాల్సింది చాలా ఉంది….అన్ని చేస్తాం… కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్లను గెలిపించాలని కేటీఆర్ కోరారు.


వందల కోట్లతో అభివృద్ధి చేసిన: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి


మునుగోడు లో గెల్చిన తర్వాత వందల కోట్లతో అభివృద్ధి చేసిన అని బీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ మళ్ళీ గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మీ సేవకునిగా పని చేస్తానని అన్నారు. మునుగోడు ను మున్సిపాలిటీ గా చేయాలని, చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేయాలని కేటీఆర్ ను కోరుతున్నానన్నారు.