తెలంగాణకు అప్పులు.. కల్వకుంట్ల కుటుంబానికి ఆస్తులు: మంత్రి పొన్నం

బీఆరెస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు అప్పులు, కల్వకుంట్ల కుటుంబానికి అస్తులు పెరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు

  • Publish Date - December 27, 2023 / 10:55 AM IST
  • 5వ తేదీలోపునే జీతాలిస్తాం

విధాత : బీఆరెస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు అప్పులు, కల్వకుంట్ల కుటుంబానికి అస్తులు పెరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం ప్రజాపాలనపై సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల అవగాహాన సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు దమ్ముంటే కల్వకుంట్ల ఆస్తులపై ” సౌధ ” పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని బంగ్లాలు కట్టారు, ఎన్ని ఫామ్ హౌస్‌లు కట్టారు.. ఎన్ని వందల కోట్ల డబ్బులు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు.


మేం అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలేదని.. కానీ ప్రభత్వాన్ని స్వేద పత్రం పేరుతో బీఆరెస్ నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. అప్పులు కాదు, సంపద సృష్టించామంటున్న బీఆరెస్ నేతలు రాష్ట్రానికి అప్పులు మిగిల్చి వాళ్లు మాత్రం ఆస్తులు కూడబెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు ప్రతి నెల 5వ తేదీలోపునే జీతాలు వేస్తామని ప్రకటించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని స్కీమ్‌లకు కలిపి ఒకటే అభయ హస్తం దరఖాస్తు ఫారం ఉంటుందన్నారు. త్వరలోనే ఆర్టీసీకి కొత్త బస్సులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు