విధాత : జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్-2024) ప్రారంభమవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, నుమాయిష్ అధ్యక్షుడు శ్రీధర్‌బాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాతుతూ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందన్నారు. 15రోజుల పాటు కొనసాగనున్న ఈ పారిశ్రామిక ప్రదర్శనను లక్షలాది మంది సందర్శిస్తారని ఆకాంక్షించారు.
పారిశ్రామిక ప్రదర్శనకు ఇదొక పెద్ద వేదికని, ఈదఫా 2,400 పైగా స్టాల్స్ ఏర్పాటవుతాయన్నారు. సందర్శకులు కరోనా జాగ్రత్తలు పాటించాలని, అంతా విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. ప్రదర్శన సందర్భంగా కరోనా వైద్య పరీక్షల కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. సందర్శకుల కోసం తొలిసారిగా శాకాహారం రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు.