మెదక్: ధరణి తప్పులు.. రైతులకు తప్పని తిప్పలు!

మంత్రుల‌కు మొర పెట్టుకున్నా తీరని స‌మ‌స్య‌లు అవ‌స‌రానికి అమ్ముకోలేని దుస్థితి బ‌తికున్నా చ‌నిపోయిన‌ట్టు రికార్డులు సృష్టిస్తున్న వైనం ప‌ట్టాల కోసం ధ‌ర్నా చేస్తున్న రైతులు ధ‌ర‌ణిని తొల‌గించాల‌ని ప‌లువురి డిమాండ్ త‌ప్పులు స‌రిచేయ‌మంటే లంచం అడుగుతున్న అధికారులు ఏసీబీకి చిక్కిన అద‌న‌పు క‌లెక్ట‌ర్‌, ల్యాండ్ స‌ర్వేయ‌ర్‌ స‌స్పెండ్ అయిన త‌హ‌సీల్దార్‌ విధాత, మెదక్ ఉమ్మడి బ్యూరో: ధరణిలో లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం దక్కకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అవస్థలు పడుతున్నారు. […]

  • Publish Date - December 27, 2022 / 04:45 AM IST
  • మంత్రుల‌కు మొర పెట్టుకున్నా తీరని స‌మ‌స్య‌లు
  • అవ‌స‌రానికి అమ్ముకోలేని దుస్థితి
  • బ‌తికున్నా చ‌నిపోయిన‌ట్టు రికార్డులు సృష్టిస్తున్న వైనం
  • ప‌ట్టాల కోసం ధ‌ర్నా చేస్తున్న రైతులు
  • ధ‌ర‌ణిని తొల‌గించాల‌ని ప‌లువురి డిమాండ్
  • త‌ప్పులు స‌రిచేయ‌మంటే లంచం అడుగుతున్న అధికారులు
  • ఏసీబీకి చిక్కిన అద‌న‌పు క‌లెక్ట‌ర్‌, ల్యాండ్ స‌ర్వేయ‌ర్‌
  • స‌స్పెండ్ అయిన త‌హ‌సీల్దార్‌

విధాత, మెదక్ ఉమ్మడి బ్యూరో: ధరణిలో లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూసమస్యలకు పరిష్కారం దక్కకపోగా.. కొత్త సమస్యలు వచ్చిపడటంతో అవస్థలు పడుతున్నారు. అధికారులు, సిబ్బంది చేసిన తప్పులకు తిప్పలు పడుతున్నారు. పోర్టల్‌‌‌‌లో భూముల వివరాలు నమోదు చేసేటప్పుడు తప్పులు దొర్లడం, ఆన్​లైన్​లో వేలాది సర్వే నంబర్లు మిస్ కావడం, ఒకరి భూములు మరొకరి పేర్లపై నమోదు కావడం, లక్షలు పోసి కొనుక్కున్న భూములకు పాత పట్టాదారుల పేరిటే కొత్త పాస్​బుక్​లు రావడం వంటి సమస్యలపై సవరణల కోసం తహసీల్దార్ల దగ్గరికి వెళ్తే ఆ చాన్స్ లేదని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారు.

మారుతున్న భూముల స‌రిహ‌ద్దులు.. విస్తీర్ణాలు

శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూముల రేట్లు కోట్లు పలుకుతున్నాయి. కానీ ధరణి సమస్యలతో రైతులకు కంటి మీద కునుకులేకుండా పోతోంది. భూముల సరిహద్దులు, విస్తీర్ణాలు వాళ్లకు తెలియకుండానే మారిపోయాయి. పట్టాదారుల భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో చేరిపోతున్నవి కొన్నికాగా, అమ్ముకున్న వారి పేర్లనే రికార్డుల్లో చూపిస్తున్నవి మరికొన్ని. వంశపారంపర్యంగా వచ్చిన భూములు సైతం రికార్డుల్లో ఇతరుల పేర్లతో నమోదు కావడంతో బాధితులు తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని తహసీల్దార్లు చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

నోషనల్ ఖాతాల్లోనే రైతుల భూములు

ధరణి పోర్టల్​కు ముందు రెవెన్యూ అధికారులు పొరపాటున నోషనల్ ఖాతాల్లో పట్టా భూములను చేర్చారు. ఇరిగేషన్ కోసం తీసుకున్న వాటికి, వక్ఫ్ భూములకు, ఫారెస్ట్ భూములకు, గవర్నమెంట్ ల్యాండ్స్‌‌‌‌కు నోషనల్ ఖాతాలు ఉంటాయి. ఇలా అనేక భూములను ఇరిగేషన్ నోషనల్ ఖాతాల్లోకి ఇష్టమొచ్చినట్లు ఎంట్రీ చేశారు. కొన్ని ప్రభుత్వ భూముల్లోని నోషనల్ ఖాతాల్లోకి వెళ్లాయి. ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద, హైవేల్లో భూములు పోయిన ప్రాంతాల్లోనే ఇది జరిగింది.

నిజంగానే ప్రాజెక్టులు, కాలువలు, రోడ్లలో కొంత భూమి పోయి, విస్తీర్ణం కట్ చేసే టైంలో ఎక్కువ తీసేసిన వారికి తిరిగి మళ్లీ ఇచ్చే ఆప్షన్ ఉంది. కానీ అసలు భూములు పోకుండానే పోయినట్లు ఎంట్రీ అయిన వారికి మాత్రం అప్లై చేసుకోవడానికి ధరణి పోర్టల్‌‌‌‌లో అలాంటి అవకాశం లేదు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆయా రైతులకు రైతుబంధు, బీమా, క్రాప్‌‌‌‌లోన్లు అందడం లేదు.

ట్విట్ట‌ర్లో మంత్రుల‌కు మొర‌పెట్టుకున్న తీర‌ని స‌మ‌స్య‌..

ఒక్కో సమస్యపై ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మంత్రులకు వినతులు వెళ్తున్నా.. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై దృష్టి సారించడం లేదు. మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావుకు ట్విట్టర్‌‌‌‌‌‌‌‌లో మొరపెట్టుకుంటే.. కలెక్టర్ కు ట్యాగ్ చేసి వదిలేస్తున్నారు. దీంతో భూసమస్యలు తీరక, రైతుబంధు పొందలేక, భూమిని అమ్ముకోలేక, కుటుంబ సభ్యుల పేర మార్చలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌లో ఒక బిట్ అసైన్డ్ భూమి ఉంటే, ఆ సర్వే నంబర్లో ఉన్నఇతర పట్టాభూములు రిజిస్ర్టేషన్ అవ్వట్లేదు. కోర్టు కేసు ఒక బిట్ పైన ఉన్నా మిగతా సబ్ డివిజన్లు రిజిస్ర్టేషన్ చేసుకోలేని పరిస్థితి.

ప్ర‌శ్నార్థ‌కంగా సేల్ డీడ్ మ్యుటేష‌న్‌..

ఒక సర్వే నంబర్లో ఎవరో ఒకరు నాలా కన్వర్షన్ చేసుకుంటే, ఆ సర్వే నంబర్లో మిగతావి రిజిస్ట్రేషన్ చేసుకునే చాన్స్ లేదు. పొరపాటున రిజిస్ర్టేషన్ ఆఫీస్‌‌‌‌లో సేల్ డీడ్ చేసుకున్న కొనుగోలుదారుడు చనిపోతే.. వారి వారసులకు సేల్ డీడ్ మ్యుటేషన్ ఎలా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటునోళ్లు చనిపోయినా వాటి పైనే ఆధార పడి ఉన్న కుటుంబ సభ్యులపై ఆ భూములు ఎలా మారుస్తారనేది స్పష్టత లేదు. పట్టాదారు పేర్లు తప్పు పడి, అన్ని అర్హతలున్నా అవసరానికి సొంత పట్టా భూమిని అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నరు.

అక్రమంగా భూ రిజిస్ట్రేషన్​.. తహసీల్దార్​ ప్రమేయం..

సంగారెడ్డిలో బతికి ఉండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్ ధ్రువీకరించి ఏకంగా 27 ఎకరాల 34 గుంటలు వేరే వారి పేరుపై పౌతి మార్పు చేశారు ఓ తహసీల్దార్. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ తహసీల్దార్ రాజయ్య భూ అక్రమాల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ మండలం నాగాన్ పల్లీ గ్రామానికి చెందిన శివమ్మ అనే వృద్ధురాలు బతికుండగానే చనిపోయినట్లు రికార్డులు సృష్టించి ఆమె పేరుపై ఉన్న భూమి (Land) పౌతీ మార్పిడికి పాల్పడ్డాడు తాహసిల్దార్ రాజయ్య.

కరోనా సమయం లో శివమ్మ భర్త హన్మంతు రెడ్డీ మృతి చెందాడు. అతనికి 198 వ సర్వే నంబర్ లో 27 ఎకరాల 34 గంటల భూమి ఉంది. దాంతో ఏప్రిల్ మాసంలో భర్త పేరుపై ఉన్న 27 ఎకరాల 34 గంటల భూమిని భర్త పేరుపై నుంచి తన పేరుపై శివమ్మ రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇటీవల బతికున్న శివమ్మను చనిపోయినట్లు రికార్డ్ సృష్టించారు. వృద్ధురాలు శివమ్మ చనిపోయిందని ధరణి వెబ్ సైట్ లో మార్పులు చేర్పులు చేసి షేరి అంజమ్మ అనే మహిళపై రిజిస్ట్రేషన్ చేసి సర్వే నంబర్ లో పట్టా భూమి కనబడకుండా తహశీల్దార్ సొంత తెలివి ప్రదర్శించాడు.

దీంతో అనుమానం తో తహసీల్దార్​ను ఆరా తీసిన శివమ్మకు ఆయన బాగోతం తెలిసిపోయింది. దీంతో తహసీల్దార్ పై జిల్లా కలెక్టర్ శరత్ కు పిర్యాదు చేశారు. అలాగే రాయికోడ్ పోలీసులకు సహితం ఫిర్యాదు చేసింది. దింతో కలెక్టర్ శరత్ అతడిని సస్పెండ్ చేసాడు. ఇలా ఒకటని కాకుండా ఉమ్మడి జిల్లాలో చాల వరకు ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయ్.

ధరణి తప్పులు సరి చేయాలంటే చేయి త‌డ‌పాల్సిందే..

మెదక్ ఉమ్మడి జిల్లాలో ధరణిలో జరిగిన అవకతవకలు.. సరి చేసుకోవడానికి రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూమి మార్పిడి (పౌతి )చేసుకొనే వారసులు.. అధికారులను ఆశ్రయించి ఎంతో కొంత ముట్ట చెప్పుకొని పనులు చేసుకుంటున్నారు.

నర్సాపూర్ నియోజక వర్గంలో ఒక రైతుకు సంబంధించి (ఏన్ఓసి) ఇవ్వడం కోసం కొంత భూమితో పాటు డబ్బులు లంచంగా ఒప్పుకొని అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అదే నర్సాపూర్ నియోజక వర్గంలోని నర్సాపూర్‌లో భూమి సర్వే కోసం జిల్లా లాండ్ సర్వే డైరెక్టర్ గంగయ్య కు రైతులు లంచం ఇస్తూ ఏసీబీ అధికారులకు పట్టించారు. లక్షల్లో ఈ అధికారి డిమాండ్ చేయడంతో రైతులు గంగయ్యను ఏసీబీకి పట్టించారు.

పట్టా పుస్తకాల కోసం.. కలెక్టరేట్ ముందు.. గిరిజన రైతుల ధర్నా

.కౌడి పల్లి మండలం రాయలాపూర్ గ్రామంలోని గిరిజన తండాలో సర్వే నెంబర్ 394, 393, 387, 394, 388 నెంబర్ లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పట్టాలు ఇచ్చి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు ఇచ్చారు. కానీ నిజమైన రైతులకు పట్టా పాస్ పుస్తకాలు రాలేదని రైతులు బుక్యా, రాజు, మాలి తదితర రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రమేశ్‌కు పిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా ఇదే మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 70లో గత 50 సంవత్సరాలుగా కాసు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఆ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధికి 2.39 ఎకరాల భూమిని పట్టా ఇవ్వడంతో గ్రామ రైతులు, బాధితులు కలెక్టర్ హరీశ్‌కు పిర్యాదు చేయగా.. పరిష్కరిస్తామని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. రైతుల సమస్యలపై విచారించి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయి.

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి..

ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణిని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని కోరారు. ధరణిలో జరిగిన పొరపాట్లను స‌రి చేయ‌డానికి అధికారులు అవినీతికి పాల్పాడుతున్నారని ఆరోపించారు. ధరణిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ అధ్వర్యంలో కాంగ్రెస్ నిరసనలు చేస్తుందన్నారు.

తమకు పట్టాలు ఇప్పించండి.. రైతు బూక్యా..

50 సంవత్సరాలుగా తాము కాస్ భూమిని కాస్ట్ చేస్తున్నామని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే పట్టాలిస్తున్నారని రైతులకు మాత్రం పట్టాలి ఇవ్వడంలేదని కౌడిపల్లి మండలం రైలాపూర్ గ్రామ గిరిజన తండా చెందిన భూక్యా ఆవేదన చెందారు. స‌ర్వే నంబర్ 393, 394, 387, 388 సర్వే నంబర్ లలో నిజమైన రైతులకు పట్టాలు ఇప్పించాల‌ని కోరుతున్నాడు.

విచారణ జరిపి న్యాయం చేస్తా.. తహసీల్దార్

కౌడిపల్లి మండలం రాయాలాపూర్ గిరిజన తండాలోని సర్వే నంబర్ 398,393,387,388సర్వే నంబర్లలో విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని కౌడిపల్లి మండలం తాసిల్దార్ కమలాద్రి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన రైతుల ధర్నా విషయమై వివరణ కోరగా తాను హైకోర్టులో ఉన్నానని వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెప్తానని తెలిపారు.