MLA Saroj Babulal Ahire | బాలింత అయినప్పటికీ ఆమె తన బాధ్యతను మరవలేదు. రెండున్నరేండ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన విధాన సభలో తన నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు.. రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఆ ఎమ్మెల్యే ఎవరో తెలుసుకోవాలంటే మహారాష్ట్ర విధాన సభకు వెళ్లాల్సిందే.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) తరఫున సరోజ్ బాబులాల్ అనే మహిళా ఎమ్మెల్యే నాసిక్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన సరోజ్ బాబులాల్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఓ వైపు తల్లిగా, మరో వైపు ఎమ్మెల్యేగా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక తన పసిబిడ్డతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు సరోజ్ బాబులాల్.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సరోజ్ బాబులాల్ మాట్లాడుతూ.. గత రెండున్నరేండ్ల నుంచి నాగ్‌పూర్‌లో శీతాకాల సమావేశాలు జరగలేదని, అందుకే ఇప్పుడు బాలింతను అయినా సమావేశాలకు హాజరుకావాల్సి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరుకాకుండా ఉంటే ప్రజలకు తాను ఏం సమాధానం చెప్పగలనని, అందుకే కష్టమే అయినా వీలు చేసుకుని సమావేశాలకు వచ్చానని సరోజ్ అహిరే స్పష్టం చేశారు.
అయితే కరోనా కారణంగా గత రెండున్నర సంవత్సరాల నుంచి నాగ్‌పూర్‌లో శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. ఇప్పుడు సమావేశాలను ఏర్పాటు చేశారు. చాలా కాలం తర్వాత శీతాకాల సమావేశాలు నిర్వహిస్తుండటంతో.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వానికి వినిపించేందుకు సిద్ధమయ్యారు.