MLA Chander | ఎమ్మెల్యే ప్రగతి దశాబ్ది యాత్ర.. అసమ్మతివాదుల ప్రజా చైతన్య యాత్ర

MLA Chander పోటీగా అసమ్మతివాదుల ప్రజా చైతన్య యాత్ర పొమ్మనలేక పొగ పెడుతున్నఅసమ్మతి నేతలు పట్టించుకోని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిస్సహాయతలో రామగుండం ఎమ్మెల్యే చందర్ విధాత బ్యూరో, కరీంనగర్: జిల్లా అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చక్క పెట్టాల్సిన ఆయనే.. చిక్కుల్లో పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడుగా ముందుకు సాగాల్సిన ఆయన డీలాపడిపోతున్నారు. ఇంటా, బయట ఎదురవుతున్న సవాళ్లు చివరకు ఆయన సీటుకే ఎసరు తెచ్చిపెడతాయేమోనని, ఆయననే నమ్ముకున్న అనుచర వర్గం ఆందోళన చెందుతున్నారు. దీంతో […]

  • Publish Date - July 17, 2023 / 09:20 AM IST

MLA Chander

  • పోటీగా అసమ్మతివాదుల ప్రజా చైతన్య యాత్ర
  • పొమ్మనలేక పొగ పెడుతున్నఅసమ్మతి నేతలు
  • పట్టించుకోని పార్టీ రాష్ట్ర నాయకత్వం
  • నిస్సహాయతలో రామగుండం ఎమ్మెల్యే చందర్

విధాత బ్యూరో, కరీంనగర్: జిల్లా అధ్యక్షుడిగా పార్టీ వ్యవహారాలు చక్క పెట్టాల్సిన ఆయనే.. చిక్కుల్లో పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దూకుడుగా ముందుకు సాగాల్సిన ఆయన డీలాపడిపోతున్నారు. ఇంటా, బయట ఎదురవుతున్న సవాళ్లు చివరకు ఆయన సీటుకే ఎసరు తెచ్చిపెడతాయేమోనని, ఆయననే నమ్ముకున్న అనుచర వర్గం ఆందోళన చెందుతున్నారు.

దీంతో జిల్లా పార్టీ వ్యవహారాల మాటేమోగాని, సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ నేతల నుండి ఎదురవుతున్న అసమ్మతిని అధిగమించేందుకు ఆయన నానాతంటాలు పడుతున్నారు.
ఆయనే పెద్దపల్లి జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు, రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్.
అవినీతి, అభివృద్ధి లేమి ఆరోపణలతో ఇప్పటికే సతమతమవుతున్న చందర్ కు సొంత పార్టీ నేతలే చాప కింద నీరు తెస్తున్నారు.

పార్టీ జిల్లా అధ్యక్షుని హోదాలో అసమ్మతి నేతల సొంత కుంపట్లను కట్టడి చేయలేక, వారికి షోకాజ్ నోటీసులు పంపే ధైర్యం చేయలేక, జరుగుతున్న పరిణామాలను ఆయన మౌన ప్రేక్షకుడిలా చూస్తుండి పోతున్నారు. రామగుండం బిఆర్ఎస్ పరిణామాలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుండి పెద్దగా స్పందన లేకపోవడం చందర్ కు ఆశనిపాతంలా మారింది.

కేటీఆర్ ఎందుకిలా..

ఇటీవల రాష్ట్రంలోని ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా, వేదికలపై తమ పార్టీ శాసనసభ్యులను ఉటంకిస్తూ వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిస్తూ వస్తున్నారు. రామగుండం పర్యటనలో మాత్రం కేటీఆర్ అందుకు విరుద్ధంగా స్థానిక శాసనసభ్యుని ప్రస్తావన తేలేదు. ఈ పరిణామం చందర్ మద్దతుదారులను హతాశులను చేసింది. కేటీఆర్ పర్యటన అనంతరం సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ గల్లంతేనని సోషల్ మీడియా తెగ హడావుడి చేసింది. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు దీనిని దృవపరుస్తున్నాయి.

ప్రజా ఆశీర్వాద యాత్ర..

ప్రతికూల పరిస్థితుల నేపద్యంలో ఎమ్మెల్యే చందర్ ‘రామగుండం ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర’
పేరిట ప్రజల్లో తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ఈ యాత్ర దోహదపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఇక్కడా ఆయనకు గట్టి షాకే తగిలింది. నియోజకవర్గంలోని అసమ్మతినేతలందరూ ఐక్యతా రాగం ప్రదర్శించి కలసికట్టుగా, ఎమ్మెల్యే ప్రజా చైతన్య యాత్రకు పోటీగా ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ ప్రారంభించారు.

పాలకుర్తి జెడ్పిటిసి సభ్యురాలు కందుల సంధ్యారాణి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, పార్టీ సీనియర్ నేత పాతపెల్లి ఎల్లయ్యలు కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర చేపట్టినట్లు ప్రకటించి తమపై నోరు విప్పే అవకాశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన చందర్ కు లేకుండా చేశారు.

ప్రజా ఆశీర్వాద యాత్రలో నేరుగా చందర్ పేరు ప్రస్తావించకుండా, రామగుండం అభివృద్ధిని ఆయన గాలికి వదిలేసారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీ నేతలు అనేకమంది బీఆర్ఎస్ లో చేరుతుండగా, రామగుండంలో పార్టీ నేతలే నాయకత్వంపై విశ్వాసం లేక బయటకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. పార్టీ నాయకులను ఇబ్బందులు పెట్టడం, అణగదొక్కడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు అధికార పార్టీ నేతల రెండు యాత్రలు వారి ఆధిపత్య పోరులో భాగమైనప్పటికి, ప్రజలు మాత్రం ఈ యాత్రలను చూసి అయోమయానికి గురవుతున్నారు.

అదే బాటలో మరి కొందరు..

వచ్చే శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అధికార పార్టీ నేతలంతా ఐక్యంగా ముందుకు సాగుతుండడం మరికొందరికి స్ఫూర్తినిచ్చినట్టయ్యింది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తాను బరిలో ఉన్నానని బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం కార్మిక సంఘం అధ్యక్షుడు, అధికార పార్టీకి చెందిన బయ్యపు మనోహర్ రెడ్డి ప్రకటించారు. సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రామగుండంలో బీఆర్ఎస్ అవినీతి మయమైందని ఆరోపించారు. అసమ్మతి నేతల ప్రజా ఆశీర్వాద సభలో తాను పాల్గొంటానని స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో అభ్యర్థికి బి ఫామ్ ఇచ్చే ముందు పార్టీ అధిష్టానం అందరిని సంప్రదించాలని,
లేనిపక్షంలో పార్టీని బతికించుకునేందుకు దేనికైనా సిద్ధమన్నారు. పాలకుర్తి మండలానికి చెందిన ఎన్ఆర్ఐ వ్యాల హరీష్ రెడ్డి, కార్పొరేటర్ మంచికట్ల దయాకర్, ధర్మశాస్త్ర బాబన్న తదితరులు కూడా తాము బరిలో ఉంటామనే సంకేతాలు పంపుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజా ఆశీర్వాద యాత్రలో వీరు పాలుపంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.