విధాత: ఎమ్మెల్యే అంటే ఏదో అనుకున్నాను.. సమాజం.. కార్యకర్తలు.. వాళ్ళను మేపడం.. మెంటెయిన్ చేయడం చాలా కష్టం.. అసలు ఎందుకు ఎమ్మెల్యేను అయ్యానా అనిపిస్తోంది.. అంటూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిర్వేదం వ్యక్తం చేశారు.
తాను ఉన్నత కుటుంబం నుంచి వచ్చానని.. మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉందని చెప్పారు. గత 50 సంవత్స రాల నుంచి రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. కానీ అప్పటి రాజకీయాల్లో ఇప్పటి రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయని వసంత వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో పది మంది పోరంబోకులను వెంట వేసుకుంటేనే రాజకీయాల్లో ముందు అడుగు వేసే పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. ఇలా చేయడం లేదు కాబట్టే.. తాను ఇంకా పాతతరం నాయకుడిగానే ఉన్నానన్నారు.
అప్పటితో పోల్చితే ప్రస్తుత రాజకీయాలు గణనీయంగా మార్పు చెందాయని వివరించారు. రౌడీలను వెంటేసుకుని వారిలా ప్రవర్తిస్తేనే ముందడుగు వేసేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేను ఎందుకయ్యానా? అని రోజూ బాధపడుతున్నానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గత మూడున్నరేళ్లలో తానెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని పథకాలు ఆపలేదని చెప్పారు. గత కొద్ది రోజులుగా వసంత కృష్ణప్రసాద్ ఇలాగే వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు.