Civic Memory | మోదీ కొత్త ఎత్తు.. ఉమ్మడి పౌర స్మృతి

Civic Memory | విధాత‌: ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్‌ తాజాగా కసరత్తు చేస్తున్నది. ఏకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో విభేదాలను ఎత్తిచూపడానికి అధికార బీజేపీ చేసిన ఎత్తుగడగా ఇది కనిపిస్తున్నది. అందుకే ఈ సమస్యపై ప్రతిపక్షాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ఉమ్మడి పౌర స్మృతిపై శివసేన, ఆప్‌ వంటి పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అవి మద్దతిచ్చే అవకాశం ఉన్నది. జూన్‌ 23న జరగనున్న విపక్షాల ఉమ్మడి సమావేశానికి ముందే ఈ అంశాన్ని ముందుకు […]

  • Publish Date - June 21, 2023 / 03:25 AM IST

Civic Memory |

విధాత‌: ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్‌ తాజాగా కసరత్తు చేస్తున్నది. ఏకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్న కూటమిలో విభేదాలను ఎత్తిచూపడానికి అధికార బీజేపీ చేసిన ఎత్తుగడగా ఇది కనిపిస్తున్నది. అందుకే ఈ సమస్యపై ప్రతిపక్షాలు ఆచితూచి స్పందిస్తున్నాయి.

ఉమ్మడి పౌర స్మృతిపై శివసేన, ఆప్‌ వంటి పార్టీలు సానుకూలంగా ఉన్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు అవి మద్దతిచ్చే అవకాశం ఉన్నది. జూన్‌ 23న జరగనున్న విపక్షాల ఉమ్మడి సమావేశానికి ముందే ఈ అంశాన్ని ముందుకు తేవాలని బీజేపీ భావించడం వెనుక ఎత్తగడ ఇదే .

విపక్షాలపై దాడి చేయడానికి బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని అందుకే దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదని విపక్షాలు మధ్య అనధికారిక ఒప్పందం ఉన్నది. ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీలు జాగ్రత్తగా స్పందిస్తున్నప్పటికీ ఏ ప్రతిపక్ష నేత కూడా అంశాన్ని పెద్దగా ప్రస్తావించడం లేదు.

క్లిష్టమైన ఈ అంశంపై కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు సున్నితంగా వ్యాఖ్యనిస్తున్నప్పటికీ ఇది ఆ పార్టీలకు బలమైన మద్దతుగా ఉన్న ముస్లిం ఓటర్ల ఆందోళలను ఎత్తిచూపే ప్రయత్నంగా పరిగణిస్తున్నారు. సమాజ్‌ వాదీ పార్టీ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.

ఉమ్మడి పౌరస్మృతిపై లా కమిషన్‌ చేస్తున్న ప్రయత్నాలపై స్పందించాలని పాట్నాలో బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కోరగా.. ఈ విషయాలపై కొంత సమయం తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు చాలా వేడిగా ఉన్నదని పాట్నాలో వ్యంగ్యంగా మాట్లాడారు. మరోవైపు ఉమ్మ డి పౌరస్మతిని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే స్వాగతించారు.

అయితే ఇది హిందువులపై వ్యతిరేకంగా ప్రభావితం చూపుతుందా? వారు (బీజేపీ) దేశం మొత్తంలో గోహత్యపై నిషేధాన్ని అమలుచేయకపోతే ఉమ్మడి పౌర స్మతి ఎలా అమలు అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ మాట్లాడుతూ.. కులమతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ జనాభా నియంత్రణ చట్టం అవసరమన్నారు. యూసీసీపై వేసిన ప్రశ్నపై స్పందించడానికి ఆయన నిరాకరించారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిరాశతో విభజన రాజకీయాలు చేస్తున్నదని భావిస్తే.. ఆ రాష్ట్ర పౌరులందరితో సంప్రదింపులు చేయాలని అప్పటిదాకా యూసీసీపై తొందరపడవద్దని లా కమిషన్‌కు 2017లో రాసిన లేఖను జేడీయూ నాయకులు గుర్తు చేస్తున్నారు. మోడీ తన ప్రభుత్వ వైఫల్యాల దష్ట్యా విషయాలను మళ్లించడమనే తన నిత్య అజెండాను ముందుకు తెచ్చి విభజన తేవాలనుకుంటున్నదని, ఇది మోడీ ప్రభుత్వ నిరాశను సూచిస్తున్నదని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ చెబుతున్నారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దానికి ముందు బీజేపీ మత రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నదని ఆ పార్టీ ఉచ్చులో పడకూడదని విపక్ష నేతలు భావిస్తున్నారు. జూన్‌ 23న జరిగే విపక్ష పార్టీల సమావేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నదే వారి ఉద్దేశంగా కనిపిస్తున్నది. అందుకే ఆ ఉచ్చులో పడకూడదని మేము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని ఓ సీనియర్‌ నేత చెప్పారు.

Latest News