Site icon vidhaatha

Rythu Bharosa-Annadata Sukhibhava: తెలుగు రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి డబ్బులు!

ఏపీలో 20వ తేదీన అన్నదాత సుఖీభవ పంపిణీ
తెలంగాణలో 16నుంచి రైతు భరోసా నిధుల జమ

Rythu Bharosa-Annadata Sukhibhava: వానకాలం పంటల సాగులో నిమగ్నమైన తెలుగు రాష్ట్రాల రైతులకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గుడ్ న్యూస్ వెల్లడించాయి. తెలంగాణలో ఈ నెల 16నుంచి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 16న సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ముఖాముఖీ సందర్భంగా రైతు భరోసాపై ప్రకటన చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసింది. ఇప్పటికే ఆర్బీఐ నుంచి రూ.3వేల కోట్లు అప్పులు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ..తాజాగా మరో రూ.4వేల కోట్ల అప్పుకు ఇండెంట్ పెట్టింది. ఈ రుణ మొత్తం మూడు రోజుల్లో సర్కార్ ఖజానాకు చేరనుంది. ఈ నిధులతో రైతు భరోసా ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. అదిగాక జూలై నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమవుతున్న క్రమంలో అంతకుముందుగానే రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లనున్నట్లుగా సమాచారం. ఈనెల 25వ తేదీకల్లా రైతు భరోసా నిధులు వేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ఒక్కో విడతలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబడుతుంది.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన హామీ అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకంతో ఏపీ ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తుంది. వీటిలో కేంద్రం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ. 6 వేలతో కలిపి.. మిగిలిన రూ. 14 వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈ డబ్బులు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. మొదటి విడతలో రూ. 7 వేలు ఈ నెల 20వ తేదీన రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు, పీఎం కిసాన్ ద్వారా రూ. 2 వేలు ఉంటాయి. రెండో విడతలో కూడా రూ. 7 వేలు, మూడో విడతలో రూ. 6 వేలు రైతుల ఖాతాల్లో జమచేస్తారు.

Exit mobile version