విధాత: వసతి గృహాల పర్యవేక్షణ పటిష్టంగా, సక్రమంగా నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల నిర్వహణ తీరును హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ తో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎస్సి 21, ఎస్టి 8, బిసి 19, మైనారిటీ 3 సంక్షేమ హాస్టళ్లు, 16 గురుకులాలు ఉన్నాయని, వీటిపై పటిష్టమైన పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. వసతి గృహాల పరిసరాలు, కిచెన్, టాయిలెట్స్ పరిశుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలని, మెస్ కమిటీ సూచనల మేరకు భోజనం అందించాలని తెలిపారు.
తప్పనిసరిగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి తల్లిదండ్రులు హాజరయ్యేలా చూడాలని, వారికి తమ పిల్లలు ఏవిధంగా వుంటున్నది. ఏ విధంగా చదువుతున్నది అవగాహన ఏర్పడుతుందని అన్నారు. పిల్లల పట్ల ప్రత్యేకంగా సమయం కేటాయించి వారితో తరచూ మాట్లాడాలని సూచించారు. వారిలో నైపుణ్యం వెలికితీసేలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు ఏర్పాటు చేయాలని సూచించారు. వారిని చదువు పట్ల మోటివేట్ చేయాలని, స్టడీ అవర్స్ పై శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
స్థానిక మెడికల్ ఆఫీసర్ సమన్వయంతో వారి ఆరోగ్యం పట్ల రెగ్యులర్ మెడికల్ చెకప్ లు ఏర్పాటు చేయించాలని తెలిపారు. మండల స్పెషల్ ఆఫీసర్స్ తమ పరిధిలోని వసతి గృహాలను తనిఖీ చేస్తుండాలన్నారు. విద్యార్థులు బయటకు వెళ్లినా, వచ్చినా తప్పనిసరిగా మూవ్మెంట్ రిజిష్టర్లో నమోదు చేయాలని, బయటి వ్యక్తులు, తల్లిదండ్రులు అయినా సరే విద్యార్థులను కలిసేందుకు వచ్చినప్పుడు వారి ఐడి ధృవీకరించుకోవాలని, అనుమతి లేనిదే బయట వ్యక్తులు వసతి గృహాలలోనికి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. వసతి గృహాల సిబ్బంది సమన్వయంతో విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకునేలా అధికారులు చూడాలని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థుల సంక్షేమమే ముఖ్యమని అన్నారు. అసిస్టెంట్ పోలీసు కమిషనర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, హాస్టల్స్ లో విజిటర్స్ రాకపోకలపై ప్రత్యేక నిఘా వుంచాలని, విజిటర్స్ కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని, హాస్టల్ లో ఒకే ప్రవేశం, ఒకే నిష్క్రమణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, స్థానిక పోలీసు సమన్వయంతో పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా ఎస్.టి. సంక్షేమ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, జిల్లా ఎస్.సి. అభివృద్ధి అధికారి జయపాల్‌రెడ్డి, జిల్లా వెనుకబడి తరగతుల అభివృద్ధి అధికారి, జిల్లా ఇన్‌చార్జి మైనారిటీ సంక్షేమ అధికారి యాదయ్య పాల్గొన్నారు.