Monkeys
విధాత: శృంగారపరమైన ఆలోచనలు కలిగినపుడు హస్తప్రయోగం చేసుకుని స్వయంతృప్తి పొందడం శాస్త్రీయంగా మంచిదా కాదా అని వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే దీనిని కొన్ని మతాలు (religions) నిషేధించడమూ తెలిసిందే.
అయితే ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైందనే అంశంపై శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. హస్తప్రయోగం మానవుడు ఆవిర్భవించిన ముందు కాలం నుంచీ.. అంటే 4 కోట్ల సంవత్సరాల నుంచే ఉనికిలో ఉందని రాయల్ సొసైటీ జర్నల్ బీ లో ప్రచురితమైన అధ్యయనం (Research) వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం..
కోతుల్లో విపరీతంగా..
ముందుగా కోతి జాతి ఈ ప్రక్రియను కనుగొని క్రమంగా అలవాటు చేసుకుంది. మితిమీరిన లైంగిక సంబంధాల వల్ల అంతుచిక్కని వ్యాధులు వాటిని చుట్టుముట్టి ఉంటాయని.. ఆ పరిస్థితిని తప్పించుకునేందుకు హస్తప్రయోగాన్ని ఆశ్రయించేవని పరిశోధకులు స్పష్టం చేశారు.
ముందుగా పురుష కోతులే ఇలా చేసుకున్నా.. తర్వాత ఆడ కోతులూ ప్రారంభించాయని తెలిపారు. కోతి జాతులపై పరిశోధన చేసిన 400 శాస్త్రవేత్తలు 246 పరిశోధనా పత్రాలు, పాంటాలజిస్టులు, జూ కీపర్లతో మాట్లాడి ఈ స్పష్టతకు వచ్చినట్లు అధ్యయన పత్రం పేర్కొంది.
అయితే.. తమ పరిశోధన ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాని, ఎందుకు మొదలైందో తెలియని ఒక లైంగిక ప్రక్రియను మరింత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని పరిశోధనలో నాయకత్వం వహించిన డా.మటిల్డా బ్రిండ్లే పేర్కొన్నారు. కొంతమంది అధ్యయనం ప్రకారం.. నిల్వ ఉండిపోయిన వీర్యాన్ని (Sperm) వదిలించుకుని నూతన వీర్యంతో సంతానాన్ని పొందడానికే చింపాజీలు, కోతులు ఎప్పటికప్పుడు హస్తప్రయోగాన్ని చేసుకునేవని తెలుస్తోంది.
ఇక్కడా వివక్షే
అయితే స్త్రీల హస్తప్రయోగంపై ఈ పరిశోధన ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం గమనార్హం. స్త్రీల లైంగిక పరమైన అంశాల్లో తరతరాలుగా వివక్ష కొనసాగడంతో.. వారికి సంబంధించిన సమాచారం ఎక్కువగా లేదని బ్రిండ్లే ఆవేదన వ్యక్తం చేశారు.
అందువల్లే తమ పరిశోధనలో స్త్రీల గురించి ఎక్కువ ప్రస్తావించలేకపోయామని ఆమె తెలిపారు. హస్తప్రయోగం మంచిదా కాదా అన్న ప్రశ్నకూ ఆవిడ సమాధానమిచ్చారు. అది మనకన్నా ముందే పుట్టిన ఒక సహజ లైంగిక ప్రక్రియ అని, ఆరోగ్యకరమైన లైంగిక ఆరోగ్యానికి అది ఒక మంచి సూచిక అని స్పష్టం చేశారు.