- మొత్తం ఏడు స్థానాల్లోనూ బీజేపీకే చాన్స్!
- ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ వెల్లడి
Delhi | న్యూఢిల్లీ : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 2019 నాటి సీన్ పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అంచనా వేసింది. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఢిల్లీలో ఏడు సీట్లు ఉన్నాయి. ఈసారి ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని, ఏడింటిలోనూ ఎన్డీయే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. బీజేపీ 57 శాతం ఓట్లతో పటిష్టస్థితిలో ఉంటుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. ఇండియా కూటమిలో ఉన్న ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా 40 శాతం వరకూ ఓట్లు తెచ్చుకుంటాయని తెలిపింది.
వాస్తవానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. కానీ.. ఈసారి ఆప్ ఓటు షేరు 15 శాతంగా ఉండొచ్చని సర్వే తెలిపింది. గత ఎన్నికలతో తాజా సర్వే గణాంకాలను పోల్చినప్పుడు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌కు, లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ ధోరణికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తున్నదని మూడ్ ఆఫ్ ది నేషన్ పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే పై చేయిగా ఉంటుండటం అనేక చోట్ల చూస్తున్నదే. ఈ క్రమంలోనే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో (2015, 2020) ఆమ్ ఆద్మీ పార్టీకి 50 శాతం చొప్పున ఓట్లు లభించాయి. కానీ.. లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి జాతీయ అంశాలు ప్రధానంగా మారుతున్నాయి.