Motkupalli Narasimhulu | మాదిగలకు అన్యాయంపై కాంగ్రెస్ దిద్దుబాట పట్టాలి

కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు

  • Publish Date - April 18, 2024 / 02:50 PM IST

మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్

విధాత: కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ నాయకత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ గురువారం బేగంపేటలోని లీలానగర్‌లోని తన నివాసంలో దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోమాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆరెస్‌, బీజేపీ రెండేసి టికెట్లు కేటాయించాయని, కాంగ్రెస్‌ ఎన్ని టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. మంద కృష్ణ మాదిగ కాంగ్రెస్‌పై చేసిన విమర్శల్లో తప్పు లేదన్నారు. మా జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన సరిగానే స్పందించారని చెప్పారు.

గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశానని ఎన్నడూ ఇంత అన్యాయం జరుగలేదని ఆయన కంటతడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మోత్కుపల్లి అవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా సీఎం కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బయట నుంచి వచ్చిన వాళ్లకే టికెట్లు ఇస్తున్నారని వాపోయారు. కనీసం ఒక్క టికెట్ అయినా మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేదన్నారు. పథకాలను చూసి జనం ఓట్లు వేయరన్నారు. తాను చస్తేనే మాదిగలకు టికెట్ ఇస్తారా అని ఫైర్ అయ్యారు. ఇదే తన చివరి ప్రెస్ మీట్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగాలని తాను మాట్లాడటం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తేలేదన్నారు. పార్టీ ఇప్పటికైనా గుర్తించి తప్పును సరిదిద్దుకోవాలన్నారు.

Latest News