Cell Phone | ఓ యువతి తన సోదరుడితో గొడవపడి సెల్‌ఫోన్‌ను మింగేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ యువతిని ఆస్పత్రికి తరలించి, శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని బింద్ జిల్లా( Bhind Dist )లో వారం రోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. బింద్ జిల్లాకు చెందిన ఓ 18 ఏండ్ల యువతి చైనీస్ సెల్‌ఫోన్ కోసం తన సోదరుడితో గొడవ పడింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడంతో.. ఆ అమ్మాయి సెల్‌ఫోన్‌ను మింగేసింది. కాసేపటికే ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. వాంతులు కూడా అయ్యాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం గ్వాలియర్‌లోని జయారోగ్య ఆస్పత్రికి తరలించారు.
తీవ్రమైన కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న బాధితురాలికి సీటీ స్కాన్, ఎక్స్ రే నిర్వహించారు వైద్యులు. ఆమె కడుపులో సెల్‌ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. ఇక రెండు గంటల పాటు యువతికి శస్త్ర చికిత్స నిర్వహించి, సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు. దీంతో ఆమెకు 10 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.