న్యూఢిల్లీ : ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఎంఫిల్ కోర్సులకు గుర్తింపు లేదని యూజీసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఎంఫిల్ కోర్సులను రద్దు చేసినట్లు యూజీసీ గుర్తు చేసింది.
ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలు తీసుకోవద్దని 2023-24 విద్యాసంవత్సరంలోనే ఆదేశాలు జారీ చేశామని యూజీసీ తెలిపింది. కానీ కొన్ని యూనివర్సిటీలు ఆ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాయి. తాజాగా మరికొన్ని యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని యూజీసీ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎంఫిల్ కోర్సులను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రోగ్రామ్‌ను ఉన్నత విద్యాసంస్థలు అందించరాదంటూ యూజీసీ నిబంధనలు -2022 రెగ్యులేషన్ నంబర్ 14 స్పష్టంగా చెబుతుందని యూజీసీ తెలిపింది. దీంతో ఆయా యూనివర్సిటీల ఎంఫిల్ కోర్సులకు గుర్తింపు లేదని మరోమారు స్పష్టం చేసింది