విధాత, రాంచీ: జార్ఖండ్‌కు చెందిన ఓ నటిని దుండగులు కాల్చి చంపారు. బెంగాల్‌లోని ఓ హైవేపై ఈ ఘటన చోటు చేసుకున్నది. చోరీ కోసం వచ్చిన దుండగులు ఆమె భర్త ముందే కాల్చి చంపారు. బుధవారం హౌరా జిల్లా, మహిశ్రేఖలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు రియా కుమార్ అలిసాయ్ ఇషా అలియా నటి, యూట్యూబర్. భర్త ప్రకాశ్, రెండేళ్ల కూతురుతో కలిసి 16 జాతీయ రహదారిపై కారులో కోల్‌కతా వైపు వెళ్తున్నారు. బగ్నాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో సాయంత్రం సమయంలో విశ్రాంతి కోసం కారు ఆపగా.. ముగ్గురు దుండగలు దాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత సొమ్మును లాక్కునేందుకు ప్రయత్నించగా రియా భర్తను కాపాడేందుకు వారిని అడ్డుకోవడంతో దుండగులు కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన అనంతరం ప్రకాశ్ కుమార్ భార్యను తీసుకొని మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణించాడు.
భార్యను ఉలుబెరియాలోని ఎస్‌ఎస్‌సీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే, నిందితులు బెంగాలీలో మాట్లాడారని, వారు ఏం మాట్లాడారో, ఎందుకు దాడి చేశారో తెలియదని మృతురాలి భర్త తెలిపాడు.
మొదట వారిని తమలాగానే పర్యాటకులని భావించినట్లు ప్రకాశ్‌కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రియా నాగ్‌పురి, భోజ్‌పురి చిత్రాలలో నటించింది. ఆమె నటించిన ఆల్బమ్స్ నాగ్‌పురి భాషలో మంచి విజయాన్ని సాధించాయి.
ఆమె స్వస్థలం జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా. ప్రస్తుతం ఆమె రాంచీలోని బరియాతు టాగోర్ హిల్‌లో ఉన్న తారామణి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. రియాకు కొత్త చిత్రంలో అవకాశం రాగా.. ఆ చిత్ర నిర్మాతలు కోల్‌కతాకు చెందినవారు. అందుకే ఆమె భర్త, కుమార్తెతో కలిసి సినిమా కోసం దుస్తులు కొనడానికి కోల్‌కతాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.