విధాత: బిగ్‌బాస్ షో ముగింపు సందర్భంగా తలెత్తిన ఘర్షణలో యువకులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసులు పెట్టించడం అనుచితంగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. ఈ వివాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులు పెట్టాల్సింది యువకులపై కాదని, బిగ్‌బాస్ షో నిర్వాహకులపైన, యాంకర్ నాగార్జునపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
గతంలో బిగ్‌బాస్ షో అరాచకమైందని, దాన్ని మూసివేయించాలని నేను సైబరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్ పనిచేసినప్పుడు ఫిర్యాదు చేస్తే, ఆయన కోర్టుకు వెళ్లమని చెప్పాడన్నారు. కోర్టుకు వెళితే పై కోర్టుకు వెళ్లమన్నారని, అక్కడికి వెళితే కింది కోర్టుకు వెళ్లమన్నారని, ఇటు పోలీస్‌శాఖ, అటు కోర్టులు కూడా భయపడి బిగ్‌బాస్ షో పై చర్యలు తీసుకోలేదన్నారు.
అసాంఘీకమైన కార్యకలాపాల అడ్డాగా బిగ్‌బాస్ షో నడుస్తుందన్నారు. డబ్బుల కోసం కక్కూర్తి పడి నాగార్జున యాంకర్‌గా చేస్తున్నారన్నారు. ఓ వంద మందిని తీసుకెళ్లీ ఓ ఇంట్లో పడేసి దాన్నో వ్యభిచార గృహంగా మార్చేశారన్నారు. ఇప్పుడు రైతుబిడ్డను తీసుకొచ్చి కొత్త నాటకం వేశారన్నారు. హిందుత్వం గూర్చి మాటలు చెప్పే బీజేపీ కూడా బిగ్ బాస్ షోపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.