విధాత: రానున్న అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్ది నలగొండ అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ఇంటి పోరు ఎక్కువవుతుంది. సీఎం కేసీఆర్ సిట్టింగులకే మళ్లీ టికెట్లని ఇటీవల ప్రకటించినప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా నల్లగొండ టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రోజురోజుకు తమ కార్యకలాపాలను ఉదృతం చేస్తున్న తీరు గులాబీ శ్రేణులను సైతం విస్మయ పరుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ధీటుగా ఆశావహులు పోటాపోటీ కార్యక్రమాలతో నియోజకవర్గంలో రాజకీయ హడావిడి చేస్తుండటం వెనుక తెగింపు ఏమిటన్న దానిపై గులాబీ పార్టీలో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల నాటికి సొంత పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే అదే ఊపులో బీజేపీ లేదా కాంగ్రెస్ నుంచైనా టికెట్ పొందవచ్చన్న ధీమానే బీఆర్ఎస్ ఆశావాహులను రాజకీయంగా ముందుకు నడిపిస్తుందన్న వాదన వినిపిస్తోంది. అదీగాక ఎన్నికల నాటి పరిస్థితులు, పొత్తుల నేపథ్యంలో సిట్టింగులకే టికెట్లన్న తన హామీలో సీఎం కేసీఆర్ మార్పులు చేసుకుంటారన్న ఆశ కూడా నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుల సొంత కార్యకలాపాల జోరుకు దోహదం చేస్తుంది.
— vidhaathanews (@vidhaathanews) January 5, 2023
ముఖ్యంగా నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల్లో పోటీకి బలమైన నాయకుల కొరత ఎదుర్కొంటున్న బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉన్న నాయకుల వైపు చూస్తుండడం, ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, నల్గొండ బీఆర్ఎస్ టికెట్ ఆశావహులు తామ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా కార్యకలాపాలు సాగించే దిశగా మరింత ధైర్యాన్ని అందిస్తున్నది. ఈ క్రమంలోనే జనం నోళ్లలో నానేందుకు వారు చేస్తున్న పబ్లిసిటీ ప్రయత్నాలు చర్చనీయాంశం అవుతున్నాయి.
నలగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి తమ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలతో జనం దృష్టిని ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలే సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్31న శనివారం తన జన్మదినం సందర్భంగా భారీ ఫ్లెక్సీల ఏర్పాటు, ప్రచార సాధనాలలో భారీ ప్రకటనలు, సేవా కార్యక్రమాలతో అమిత్ రెడ్డి నియోజక వర్గంలో హంగామా చేశారు.
అటు పార్టీ సీనియర్ నాయకులు చాడ కిషన్ రెడ్డి సైతం భారీ ప్లెక్సీలతో తగ్గేదేలే అన్నట్టుగా నియోజక వర్గంలో తన సొంత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పైగా వీరు ఏర్పాటు చేసిన, చేస్తున్న ఫ్లెక్షీలలో ఎమ్మెల్యే కంచర్ల ఫొటో కనబడకపోవడం మరో విశేషం. ఇక నిన్న మొన్నటి దాకా సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు ప్రధాన అనుచరుడుగా ఉన్న పిల్లి రామరాజు కూడా పార్టీ టికెట్ కోసం అధిష్టానం దృష్టిలో పడేందుకు మీడియాలోనూ, సేవా కార్యక్రమాలతో తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
సీనియర్ నేత బ్రాహ్మణ పరిషత్ సభ్యులు చకిలం అనిల్ కుమార్ ఈ దఫా టికెట్ విషయంలో రాజీ పడకూడదన్న పట్టుదలతో ఉన్నారు. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనకు టికెట్ ఇవ్వకపోగా, ఎమ్మెల్సీ పదవినైనా ఇవ్వలేదని, అయినా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నానని, సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్లకు టికెట్ నిరాకరిస్తే తనకు ఈ దఫా టికెట్ ఇవ్వాలంటూ కోరుతున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన పార్టీ పరంగా తన స్వరాన్ని తరచూ వినిపిస్తూనే ఉన్నారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి సైతం టికెట్ రేసులో ఉన్నారు.
అయితే సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశంలో వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకే మళ్లీ టికెట్లు ఇస్తానంటూ వారికి టికెట్ విషయంలో ముందస్తు భరోసా ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన ఆ మాటలే శ్రీరామరక్షగా టికెట్ విషయమై నలగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి టికెట్ పై గట్టి ధీమాతో తన పని తాను చేసుకు వెళ్తున్నారు.
అయితే సొంత పార్టీల నాయకులు టికెట్ విషయంలో అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు, జనంలో నానెందుకు హడావిడి పెంచడం రాజకీయంగా కంచర్లలో అసహనాన్ని రగిలిస్తుంది. దీనికి తోడు పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు పలువురు అసమ్మతి బాట పట్టడం, తన దుందుడుకు స్వభావంతో దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోవడం కంచర్లకు ప్రతికూలంగా మారుతుంది.
ఇక పార్టీ అధినేతగా సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూడకుండా మళ్లీ వారికే సీట్లు అన్న ప్రకటన చేసియున్నప్పటికీ అది పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఆశిస్తున్న మిగతా బీఆర్ఎస్ నాయకుల్లో అసంతృప్తికి కారణమవుతుంది. టికెట్ కోసం పార్టీలో సొంత కార్యక్రమాలు కొనసాగిస్తూనే టికెట్ రాని పక్షంలో పక్క పార్టీలలో దూకాలన్న తెగింపు బీఆర్ఎస్ ఆశావాహులలో రేకెత్తడానికి ఓ రకంగా సీఎం కేసీఆర్ చేసిన ఆ ప్రకటనే కారణం అవుతుందన్న అంతర్మథనం గులాబీ వర్గాల్లో సాగుతోంది.
ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి మళ్లీ తాను నల్గొండ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్నికల బరిలో మూడోసారి పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ నేత దుబ్బాక నరసింహ రెడ్డికి సైతం బీజేపీనే ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. ఇంకోవైపు రానున్న ఎన్నికల్లో బీజేపీ నల్గొండ టికెట్ ఆశిస్తున్న బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్, నూకల నరసింహారెడ్డిలను టికెట్ సాధనలో వలస నేతలతో ఎదురయ్యే పోటీ కలవర పెడుతుంది. ఎన్నికల దాకా తాము వ్యయ ప్రయాసలతో పార్టీని నడిపిస్తే తీరా టికెట్ మాత్రం వలస నేతలు ఎగురేసుకు పోతే ఎట్లా అన్న బెంగ వారిని పార్టీ కార్యకలాపాల నిర్వాహణలో డైలమాకు గురి చేస్తుండటం కొసమెరుపు. అయితే ఎప్పుడూ లేనంతగా ఈసారి కోమటిరెడ్డి, దుబ్బాకల చుట్టూనే రాజకీయాలు తిరుగుతాయని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.