Site icon vidhaatha

Nalgonda | వీధి కుక్కల దాడిలో జింక మృతి

Nalgonda

విధాత: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామర భీమనపల్లి గ్రామ శివారులో మంగళవారం వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. జింకను కుక్కలు వేటాడుతున్న విషయం గమనించిన గ్రామస్తులు యువకులు బిఆర్ఎస్ నేత ఎంపిటిసి విష్ణుకు సమాచారం అందించారు. ఆయన గాయపడిన జింక వద్దకు చేరుకొని వైద్యులను పిలిపించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి జింక ప్రాణాలు విడిచింది.

ఎంపీటీసీ విష్ణు మండల అటవీశాఖ అధికారులకు జింక మృతి సమాచారం అందించి, జింకను అటవీ శాఖ అధికారి నవీన్‌కు అప్పగించారు. అనంతరం జింకను అటవి శాఖ అధికారి సమక్షంలో పంచనామా చేసి ఖననం చేశారు.

ఈసందర్బంగా ఎంపీటీసీ సిలివేరు విష్ణు మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలలో వందలాది జింకలు కేవలం కుక్కల దాడిలోనే మృతి చెందాయన్నారు. ఇతర జంతువుల వేట వలన ఇంకా చాలా మృతి చెందుతుండొచ్చన్నారు.

జింకలు మరణించడమే కాకుండా, వాటి ఆహారం కోసం వ్యవసాయ పంటలను నాశనము చేస్తున్నాయన్నారు. జింకల బెడద నుండి రైతులు వేసిన పంటలను కాపాడటంతో పాటు వన్య ప్రాణులను కుక్కల దాడుల నుండి రక్షించుకునేందుకు జింకలను ఇక్కడ నుండి ఇతర అటవీ ప్రాంతాలకు తరలించి రైతులకు న్యాయం చేయాలనీ జిల్లా అటవీ శాఖ అధికారులన కోరారు.

జింకల బెడద వల్ల దామెర బీమానపల్లి, కమ్మగూడెం, లెంకలపల్లి, సరంపెట, ఇందుర్తి, రాంరెడ్డి పల్లి, తదితర గ్రామాల రైతులు నిద్ర పోకుండా రాత్రి సమయాలలో పంట చేనుకు కాపలాగా ఉంటున్నారన్నారు.

పలు మార్లు జిల్లా అటవి శాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోయిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అటవి శాఖ అధికారి నవీన్ కుమార్, కాస నరేష్ , వస్పరి సురేష్, జంగయ్య, నీల రమేష్ , నరసింహ, గిరి, యాదయ్య, శంకర్ తదితరులు ఉన్నారు.

Exit mobile version