Site icon vidhaatha

Nalgonda | నక్కలగండి ప్రాజెక్టును పరిశీలించిన కేంద్ర మంత్రి పాండే..

Nalgonda

విధాత: కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే ఆదివారం సాయంత్రం శ్రీశైలం సొరంగం ప్రాజెక్టులో భాగమైన నక్కలగండి ప్రాజెక్టును సందర్శించి అసంపూర్తి పనులను పరిశీలించారు. పార్లమెంటు నియోజకవర్గాలలో పార్టీ బలోపేతం లక్ష్యంగా బిజేపి చేపట్టిన పార్లమెంట్ ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా పాండే నల్గొండ పార్లమెంట్ నియోజవర్గంలో ఆది, సోమవారం పర్యటించనున్నారు.

పర్యటనలో భాగంగా దేవరకొండ నియోజక వర్గం పరిధిలో నక్కలగండి ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యానికి కారణాలను స్థానిక బిజెపి నాయకులను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుర్రంతండాలోని గిరిజనులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేసిన అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గం పర్యటనకి బయలుదేరారు.

సోమవారం ఆయన మిర్యాలగూడ పర్యటనలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్లతో, వివిధ వర్గాల ప్రజలు, ప్రముఖులతో భేటీ కానున్నారు. అంతకుముందు పార్లమెంట్ ప్రభాస్ యోజన కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన కేంద్రమంత్రి పాండేకు బిజెపి జిల్లా నాయకత్వం డిండి వద్ద ఘన స్వాగతం పలికింది.

బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, నాయకులు రవీంద్ర నాయక్, లాలూ నాయక్, జితేందర్, వీరెల్లి చంద్రశేఖర్, శ్రీదేవి, నాగం వర్షిత్ రెడ్డి, బండారు ప్రసాద్ తదితరులు స్వాగతం పలికారు.

Exit mobile version