NASA
విధాత: అంగారకుడి (Mars) మీదకు నాసా పంపిన ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్‌తో రెండు నెలల క్రితం సంబంధాలు తెగిపోవడంతో శాస్త్రవేత్తలు ఆందోళనకు గురయ్యారు. అనేక ప్రయత్నాలు చేసి విఫలం కావడంతో ఇంచుమించుగా ఆశలు వదిలేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా సిగ్నల్స్ ఆగిపోయిన 63 రోజుల తర్వాత హెలికాప్టర్ తనకు తానుగా సందేశం పంపడంతో నాసా ఆశ్చర్యపోయింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అంగారకుడిపై జీవ అవశేషాలను కనుగొనడానికి 2021లో నాసా పంపిన పర్సెవరెన్స్ (Perseverance) రోవర్‌కు ఈ మినీ హెలికాప్టర్ అనుసంధానమై ఉంటుంది. అవసరమైనపుడు ఇది రోవర్ నుంచి గాల్లోకి ఎగిరి సమాచారాన్ని సేకరిస్తుంది. 2021 నుంచి ఇది పలుమార్లు మార్స్ మీద ఎగిరి రోవర్‌కు ఎంతాగనో తోడ్పడింది.
చివరిసారిగా ఏప్రిల్ 26న 52వ సారి ఇన్‌జెన్యుటీ (Ingenuity) ని ప్రయోగించగా నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) నుంచి దానికి సంబంధాలు తెగిపోయాయి. సుమారు 1191 అడుగుల నుంచి అది కిందకి పడిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రోవర్‌కు, హెలికాప్టర్‌కు మధ్యలో భారీ కొండ అడ్డం ఉండటంతో దానితో సిగ్నల్స్ పునరుద్ధరించుకోవడం సాధ్య పడలేదని ఇన్‌జెన్యుటీ బృంద నాయకుడు జాషువా అండర్సన్ తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో తనను తాను రక్షించుకునే విధానం, భూమికి సిగ్నల్స్ పంపే విధానం ఇన్‌జెన్యుటీకి తెలుసని ఆయన తెలిపారు. అయితే గతంలో ఇన్ని రోజులు సంబంధాలు తెగిపోవడం జరగలేదని అన్నారు. ప్రస్తుతం దాని పరిస్థతి బాగానే ఉందని, మరికొన్ని రోజుల్లో అది గాల్లోకి ఎగరడానికి సిద్ధపడుతుందని జాషువా వెల్లడించారు.