కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేయ‌కండి.. నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో కీల‌క‌మైన మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగింది.

  • Publish Date - November 30, 2023 / 09:52 AM IST
  • ప్ర‌మాదంలో మేడిగ‌డ్డ‌తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు
  • మీ డిజైన్లు సీడ‌బ్యుసీ చూడ‌లేదు
  • మూడు బ్యారేజీల‌పై విచారించండి
  • ఎందుకు కుంగిపోయిందో చూడండి
  • రాష్ట్రానికి స్ప‌ష్టం చేసిన‌ నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ
  • ఎన్నిక‌ల ముంగిట బ‌య‌ట‌కు రాకుండా దాచిన రాష్ట్ర ప్ర‌భుత్వం


విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో కీల‌క‌మైన మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగింది. అలాగే మ‌రో బ్యారేజీ అన్నారంకు బుంగ ప‌డింది. దీనిపై తీవ్రంగా స్పంధించిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప‌రిశీలించి డేంజ‌ర్‌లో ఉన్నాయ‌ని తెలిపింది. పైగా ఈ ప్రాజెక్టుకు సీడ‌బ్యుసీ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని కూడా తేల్చి చెప్పింది.


ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఈనెల 24వ తేదీన రాసిన లేఖ‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఎవ‌రికి తెలియ‌కుండా ర‌హ‌స్యంగా దాచింది. ఎన్నిక‌ల‌కు ముందు బ‌య‌ట‌కు పొక్కితే రాష్ట్రంలో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని భావించి బీఆరెస్ స‌ర్కారు బ‌య‌ట‌కు రాకుండా దాచింది. ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే బాగుండ‌ద‌ని అధికారుల‌ను కూడా హెచ్చ‌రించిన‌ట్లు తెలిసింది.


అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలిసిన మాచారం ప్ర‌కారం.. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌లో అంత‌ర్భాగ‌మైన మేడిగ‌డ్డ తో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప్ర‌మాదంలో ఉన్నాయ‌ని, వాటిల్లో నీళ్లు నిల్వ చేయ వ‌ద్ద‌ని నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ రాష్ట్రానికి స్ప‌ష్టం చేసింది. అక్టోబ‌ర్‌21వ తేదీన‌ మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిన త‌రువాత నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వ‌చ్చి ప‌రిశీలించి, రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింది.


అథారిటీ ఇచ్చిన నివేదిక‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ప్పు ప‌డుతూ కేంద్రానికి లేఖ రాసింది. ఈ లేఖ‌పై తీవ్రంగా స్పంధించిన నేష‌న‌ల్ డ్యాం సేఫ్టీ అథారిటీ లేఖ రాస్తూ తాము ఎత్తి చూపిన అంశాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం స్పంధిచ‌లేద‌ని పేర్కొంటూ ఈనెల‌24వ తేదీన లేఖ రాసింది. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు డిజైన్ల‌ను సీడ‌బ్ల్యుసీ చూడ‌లేద‌ని, ప‌రిశీలించ‌లేద‌ని అనుమ‌తి కూడా ఇవ్వ‌లేద‌ని తెలిపింది.


తెలంగాణ నీటి పారుద‌ల శాఖ‌లో ఉన్న సీడ‌బ్యుసీ అక్రిడిటేష‌న్ క‌లిగివున్న సెంట్ర‌ల్ డిజైన్‌ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఓ)నే చూసింది కానీ, సీడ‌బ్యుసీ ఆమోదం తీసుకోలేద‌ని అథారిటీ స్ప‌ష్టం చేసింది. దీనికి సీడీఓ మాత్ర‌మే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. తెలంగాణ ప్ర‌భుత్వం సీడీఓ దృవీక‌రించిన స‌ర్టిఫికెట్‌ను మాత్ర‌మే డీపీఆర్‌తో స‌మ‌ర్పించింద‌ని తెలిపింది.


మ‌రో వైపు మేడిగ‌డ్డ డిజైన్ మాదిరిగానే నిర్మించిన సుందిళ్ల‌, అన్నారం బ్యారేజీల‌లో లీకేజీలున్నాయ‌ని తెలిపింది. త‌క్ష‌ణ‌మే వాటిపై చ‌ర్య‌లు తీసుకోక పోతే తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌న్న‌ది. మేడిగ‌డ్డ ఎందుకు కుంగి పోయింది, అన్నారంలో ఎందుకు బుంగ ప‌డింది, సుందిళ్ల‌లో ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది క్షున్నంగా ప‌రిశీలించి చూడాల‌ని అథారిటీ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.


అన్నారం, సుందిళ్ల బ్యారేజీల‌లో నీళ్లు నిల్వ ఉంచ‌డం మంచిది కాద‌ని, నీటి నిల్వ‌ల‌ను త‌గ్గించాల‌ని స్ప‌ష్టం చేసింది. మేడిగ‌డ్డ కుంగు బాటుకు ప్ర‌ధానంగా డిజైనింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌, ప్ర‌ణాళిక‌, నిర్వ‌హ‌ణ లోపాలే ప్ర‌ధాన కార‌ణాల‌ని మ‌రోసారి ఈఅథారిటీ తెలిపింది. బ్యారేజీ కుంగు బాటుతో ప్ర‌స్తుతం మేడిగ‌డ్డ నిరుప‌యోగంగా మారింద‌ని తెలిపింది.