New Couple
విధాత: ఇటీవలే ఒక్కటైన వైద్యుల జంట 10 రోజులు గడవక ముందే హనీమూన్‌లో మృత్యువాత పడిన విషాద ఘటన ఇది. తమిళనాడులోని పూనామల్లేకు చెందిన ఈ వైద్యుల జంట.. ఇండోనేసియాలోని బాలిలో హనీమూన్ గడపడానికి వెళ్లారు.
అక్కడ ఫొటో షూట్‌లో భాగంగా వాటర్ బైక్ నడపడానికి సిద్ధమయ్యారు. దానిపై వేగంగా దూసుకెళ్తున్న క్రమంలో.. బైక్ అదుపు తప్పి సముద్రంలో తిరగబడింది. సహాయక సిబ్బంది కాపాడాలని ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతులను లోకేశ్వరన్, విభూష్నియాలుగా గుర్తించారు.
వీరికి జూన్ 1న వివాహం కావడం గమనార్హం. యువకుడి మృతదేహం వెంటనే లభించగా.. విభూష్ని మృతదేహం శనివారం ఉదయం బయటపడింది. ప్రస్తుతం వీరి మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఇండోనేసియా బయలుదేరారు.
చెన్నై నుంచి ఇండోనేసియాకు నేరుగా ఫ్లైట్‌లు లేకపోవడంతో.. మలేసియా మీదుగా వారి మృతదేహాలు రావాల్సి ఉంది. ఇంకా పెళ్లి హడావుడి పూర్తికాక ముందే ఈ దుర్ఘటన వార్త చేరడంతో.. వీరి పెళ్లి జరిగిన సెన్నర్‌కుప్పం గ్రామం విషాదంలో మునిగిపోయింది.